TEAM INDIA: షేక్ ఆడించిన అభిషేక్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 12.5 ఓవర్లలోనే చేధించింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ 79 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ 26, తిలక్ వర్మ 19 రన్స్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ రెండు, రషీద్ ఒక వికెట్ తీశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0గా ఉంది.
తడబడ్డ ఇంగ్లాండ్
ఈ మ్యాచులో ఇంగ్లాండ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ బట్లర్ మినహా మిగతా బ్యాటర్లు కనీసం పోరాడలేకపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), బెన్ డకెట్ (4)ను అవుట్ చేసిన అర్ష్‌దీప్.. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థికి షాకిచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బట్లర్.. బ్రూక్ (17)తో కలసి మూడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, మధ్య ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ పరుగులను కట్టడి చేశారు. ఎనిమిదో ఓవర్‌లో బ్రూక్, లివింగ్‌స్టోన్ (0)ను అవుట్ చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 74/4తో ఒత్తిడిలో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడుతున్న బట్లర్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. జాకబ్ బెథెల్ (7)ను పాండ్యా పెవిలియన్ చేర్చాడు. 17వ ఓవర్‌లో చక్రవర్తి బౌలింగ్‌లో సిక్స్ బాదిన బట్లర్.. ఆ తర్వాతి బంతికి క్యాచవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఇంగ్లండ్ మరింత డీలాపడింది. ఇంగ్లండ్ కష్టంగా 130 మార్క్ దాటింది.
ఛేదనలో ధనాధన్
ఛేదనలో ఓపెనర్ అభిషేక్ వీరవిహారంతో.. భారత్ సులువుగా నెగ్గింది. ఎడాపెడా షాట్లతో శర్మ విరుచుకుపడడంతో ఇంగ్లండ్ బౌలర్లకు దిక్కుతోచలేదు. శాంసన్‌తో కలసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించిన అభిషేక్.. తిలక్ వర్మతో మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమిండియా మరో 43 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. వరుణ్ చక్రవర్తి (3/23) పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టీ20 శనివారం చెన్నైలో జరగనుంది.
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన నితీష్
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో బట్లర్ ఓ భారీ షాట్‌కు యత్నించగా, నితీష్ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద డైవ్ చేసి అద్భుత క్యాచ్‌ను అందుకున్నారు. ఈ క్యాచ్‌తో మ్యాచ్‌కి కీలకమైన మలుపు తీసుకువచ్చారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com