CRICKET: నేడే భారత్-శ్రీలంక రెండో వన్డే
భారత్- శ్రీలంక మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. నేడు ఆతిథ్య శ్రీలంకతో రోహిత్‌సేన అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ నెగ్గాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో విజయం తప్పనిసరి. తొలి మ్యాచ్‌లో తిరిగే పిచ్‌పై బోల్తా కొట్టిన భారత జట్టు ఈసారి స్పిన్ గండాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. కొలంబో: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండో సవాల్‌కు టీమ్‌ఇండియా సై అంటోంది. ఆఖర్లో ఒక్క పరుగు చేయడంలో తడబడి.. మ్యాచ్‌ను టైగా ముగించిన భారత్ రెండో పోరులో సాధికారిక విజయంపై కన్నేసింది. పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగినా.. పిచ్ పరిస్థితులు, స్పిన్నర్ల దెబ్బకు 231 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. 47.3 ఓవర్లలో 230/8తో స్కోరును సమం చేసినా.. ఆఫ్ స్పిన్నర్ చరిత్ అసలంక వరుస బంతుల్లో శివమ్ దూబె, అర్ష్‌దీప్ సింగ్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను టైగా ముగించాడు. భారీ లక్ష్యం కాకపోయినా గెలుపు తీరానికి చేరకపోవడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. కెప్టెన్ రోహిత్‌శర్మ క్రీజులో ఉన్నంత వరకు భారత్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయితే స్పిన్నర్ల రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. రోహిత్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ స్పిన్ అడ్డంకిని అధిగమించలేకపోయారు. మొదటి వన్డే టై కావడంతో రెండు జట్లూ విజయాన్ని నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
తొలి మ్యాచ్ టై కావడంతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఓడిపోయే దశ నుంచి మ్యాచ్‌ను టైగా ముగించిన శ్రీలంక...పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు రోహిత్ శర్మ సేన సిద్ధంగా ఉంది. గత మ్యాచ్‌లో స్పిన్ ఆడడంలో తడబడిన భారత బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో దాన్ని సమర్దంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. గత మ్యాచ్‌లో మంచి స్కోరు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో అందరూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో దాన్ని అధిగమించాలని టీమిండియా చూస్తోంది. ఈ మ్యాచ్‌లో సాధికార విజయం సాధించి... సిరీస్‌ను గెలవాలన్న ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే టీ 20ల్లో ఓడినా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంక కూడా చూస్తోంది.
తొలి మ్యాచ్‌లో పిచ్ నెమ్మదిగా ఉండటం, లైట్ల కింద బ్యాటింగ్ చేయాల్సి రావడం భారత బ్యాటర్లకు కష్టంగా మారింది. భారత బ్యాటర్లు క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించినా లంక స్పిన్నర్లు రాణించడంతో అవి నెరవేరలేదు. శివమ్ దూబే రాణించినా భారత్‌కు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. వీటన్నింటినీ అధిగమించి రెండో వన్డేలో ఏకపక్ష విజయం సాధించాలని రోహిత్ సేన చూస్తోంది.
భారత జట్టు:
రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, కె.ఎల్.రాహుల్ , వాషింగ్టన్ సుందర్, శ్రేయస్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌సింగ్
శ్రీలంక:
చరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిస్సంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, జనిత్ లియనాగె, వెల్లలాగె, హసరంగ, అకిల దనంజయ, మహ్మద్ షిరాజ్, అసిత ఫెర్నాండో
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com