Indian Jersey : భారత జెర్సీపై మరో స్టార్.. ఇది దేనికి చిహ్నమంటే!
టీ20 ప్రపంచకప్ చాంపియన్ భారత జట్టు మరో సిరీస్ కు సిద్ధమైంది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా నెట్స్ ప్రాక్టీస్ వేగం పెంచింది. జూలై 27 శనివారం తొలి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బృందం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు.
పేసర్లు మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్ లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ విజయాలకు గుర్తుగా భారత క్రికెటర్ల జెర్సీపై రెండు నక్షత్రాలను బీసీసీఐ ముద్రించింది. లంకతో జరుగనున్న టీ20 సిరీస్లో భారత జట్టు టూ స్టార్ జెర్సీని ధరించనుంది.
ఈ మధ్యే కరీబియన్ గడ్డపై భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలుపొందింది. అంతకుమందు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో తొలి ఎడిషన్(2007)లోనే భారత్ చాంపియన్ గా అవతించింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం 17 ఏండ్లు నిరీక్షించాల్సి వచ్చింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు జూన్ 29న కోట్లాదిమంది భారతీయుల కలను నిజం చేస్తూ ట్రోఫీని ముద్దాడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com