ASIA CUP: ఆసియా కప్ నుంచి భారత్ ఔట్?

ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ టోర్నీ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుండటమే కారణమని సదరు కథనాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌తో సంబంధాలు అంతంత మాత్రమే ఉండటంతో ఏసీసీ ఏజీఎంను ఢాకాలో నిర్వహించడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తుంది. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నాయి. కానీ, తటస్థ వేదికైనా యూఏఈలో టోర్నీ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ సెప్టెంబర్‌లో టోర్నీని నిర్వహించేందుకు ఏసీసీ ప్రయత్నిస్తోంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ జరగడంపై సందిగ్ధం నెలకొంది.
వివాదం ఏమిటి?
పీసీబీ ఛైర్మన్‌గా మొహసిన్ నఖ్వి నియమితులైన తర్వాత, ఆయన గతంలో బీసీసీఐపై చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా భారత్‌ను ఉద్దేశించి “టీమిండియాను అవమానించిన” తీరు వివాదాస్పదంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంపై ట్వీట్ చేస్తూ, టోర్నీ విజేత అయిన భారత్‌ను ప్రస్తావించకుండా మిగతా విషయాలన్నింటినీ నఖ్వి పేర్కొనడం భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇది ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై మరింత ప్రభావం చూపుతోంది. . పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వి తీసుకున్న వైఖరి, ముఖ్యంగా భారత్ – పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఆటంకం కలిగించేలా ఉన్నాయి.
వేదిక మార్చాలని డిమాండ్
ఈ నెల 24న ఢాకాలో ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. బంగ్లాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఏసీసీ మీటింగ్ వేదికను మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఢాకాలో జరిగితే ఏసీసీ మీటింగ్‌కు హాజరుకామని కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆ మీటింగ్‌లో ఆమోదించిన ఏ తీర్మానాన్ని అయినా బహిష్కరిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఏసీసీ ప్రెసిడెంట్‌గా జై షా రాజీనామా చేసిన తర్వాత పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఏసీసీ పగ్గాలు చేపట్టారు. ఏసీసీ మీటింగ్‌కు హాజరు కావాలని భారత్‌పై మొహ్సిన్ నఖ్వీ అనవసర ఒత్తిడి తెస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఏసీసీ వేదికను మార్చాలని బీసీసీఐ కోరినా అందుకు నఖ్వీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com