ASIA CUP: భారత్-పాకిస్థాన్ మధ్య మహా సంగ్రామం

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. దాయాదుల పోరును ఇరు దేశాల అభిమానులు మ్యాచ్‌లా కాకుండా ఓ చిన్నపాటి యుద్ధంలా చూస్తారు. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ ప్రపంచం దృష్టంతా ఆ మ్యాచ్‌పైనే ఉంటుంది. ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో విజయం తర్వాత కరాచలనం వివాదం రచ్చ లేపింది. బాయ్‌కాట్ చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన దాయాది.. ఆ తర్వాత దారికొచ్చింది. భారత్ కూడా పాక్‌పై విజయాన్ని పహల్గామ్ ఉగ్ర బాధితులకు అంకితం చేసింది. షేక్ హ్యాండ్ వివాదంలో ఐసీసీ-పీసీబీ-బీసీసీఐ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇన్ని వివాదాల మధ్య దాయాదులు మళ్లీ సమరానికి సిద్ధమయ్యారు. సూపర్ 4లో కీలకమైన మ్యాచులో అమీతుమీ తేల్చుకోనున్నారు. తొలి మ్యాచులో తేలిపోయిన పాకిస్థాన్.. ఈ మ్యాచులో సత్తా చాటాలని భావిస్తోంది. పాక్‌కు మరోసారి షాక్ ఇచ్చి సత్తా చాటాలని.. అభిమానులకు మధుర జ్ఞాపకాలను ఇవ్వాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.
భారత్ వదలదు.. పాక్ విడవదు
సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్మెన్లు, బౌలర్లు అద్భుతంగా రాణించి పాకిస్థాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. భారత్ పాకిస్థాన్‌ను కేవలం 127 పరుగులకే కట్టడి చేసింది. 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు సూపర్-4లో మళ్లీ తలపడుతుండడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. పాకిస్థాన్ తమ మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో టీమిండియా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది.
పటిష్టంగా కనిపిస్తున్న భారత్
దిగ్గజ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత బరిలోకి దిగిన భారత్.. ఆసియా కప్‌లో పర్వాలేదనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆసియా కప్‌లో ఓటమన్నదే లేకుండా సూపర్ 4లోకి వచ్చింది. రోకో వారసత్వాన్ని పుణికి పుచ్చుకునేందుకు యంగ్ ఇండియా అడుగులు వేస్తున్నది. శుభ్‌మన్ గిల్, అభిషేక్‌శర్మ రూపంలో టీమ్ఇండియా అదిరిపోయే ఓపెనింగ్ జోడీ దొరకగా, తిలక్‌వర్మ, శాంసన్, సూర్యకుమార్, హార్దిక్, శివమ్ దూబే, బుమ్రా, కుల్దీప్ లాంటి క్రికెటర్లతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. కానీ గిల్ అంచనాలు అందుకోలేక పోతుండడం... అభిషేక్ విధ్వంస ఆరంభాలు ఇస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత టాపార్డర్ పంజా విసిరితే పాక్ బౌలర్లకు తిప్పలు తప్పవు. స్పిన్నర్ కుల్దీప్ మాయాజాలం.. యార్కర్ కింగ్ బుమ్రా పేస్ ను పాక్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. గత మ్యాచులో షాహిన్షా అఫ్రిదీ మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ బౌలర్ లేని పాక్..టీమ్ఇండియా ఏ మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇదిలా ఉంటే సల్మాన్ అలీ అగా కెప్టెన్సీలో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పాక్‌కు సయిమ్ ఆయూబ్, హరిస్ కీలకంగా మారారు. పాకిస్థాన్ ఒక మ్యాచ్‌ల్లో ఓడినా, మళ్లీ టైటిల్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్ గురించి రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఆసియా కప్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నుంచి, రెండు జట్ల ఆటగాళ్ల వైఖరి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. 'నో హ్యాండ్‌షేక్' హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com