BGT: డ్రా దిశగా గబ్బా టెస్టు

BGT: డ్రా దిశగా గబ్బా టెస్టు
X
పోరాడిన భారత లోయర్ ఆర్డర్.. మెరిసిన రాహుల్, జడేజా, ఆకాశ్ దీప్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌లో కేఎల్‌ రాహుల్‌ (84) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోరుకు చేరుకోలేకపోయారు. చివరలో జడేజా (77) ఒంటరి పోరాటం చేయడంతో స్కోరు 200 దాటగలిగింది. బుమ్రా (10), ఆకాశ్‌ దీప్‌ (27) టీమిండియాకు ఫాలోఆన్‌ గండాన్ని తప్పించారు. ప్రధాన బ్యాటర్లలో చాలా మంది ఇబ్బంది పడ్డా.. టెయిలెండర్లు ఆకాశ్ దీప్ (27), జస్‌ప్రీత్ బుమ్రా (10) భారత్‌ను ఆదుకున్నారు. అబేధ్యమైన పదో వికెట్‌కు ఈ జోడీ 39 పరుగులు జోడించింది. దీంతో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. నాలుగో రోజు ఆటకు కూడా వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. ఇక చివరకు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను త్వరగానే ముగించారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.


పోరాడిన రాహుల్, జడేజా

ఓవర్‌ నైట్‌ స్కోరు 51/4తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌ను ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ఆటతో ఆదుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(10) విఫలమైనా.. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడిన రాహుల్.. విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో రాణించాడు కేఎల్‌ రాహుల్‌తో పాటు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన జడ్డూ 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరు హాఫ్‌ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. 141 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి (16) కూడా త్వరగానే ఔట్ కావడంతో 194 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఫాలో ఆన్ గండం దాటాలంటే ఇంకా 52 పరుగులు అవసరం.

గట్టెక్కించిన పేసర్లు

ఫాలో ఆన్‌ గండం నుంచి తప్పించుకోవాలంటే.. జడ్డూ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగే సమయానికి భారత్‌ ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్‌ ఆకాశ్‌ దీప్‌ బ్యాట్‌తో అదరగొట్టాడు. మరో పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలో ఆన్‌ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.

సిరీస్‌కి దూరంగా హేజిల్‌వుడ్!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ దూరం కావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో మ్యాచ్‌ సమయంలో హేజిల్ ‌వుడ్‌కు చాలా గాయాలయ్యాయి. అలాగే భారత్‌తో జరిగిన నాలుగో రోజు వార్మప్ సమయంలో కుడి కాలు పిక్కలు పట్టేసింది. దీంతో అతడిని స్కానింగ్ కు పంపించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ పేర్కొంది. హేజిల్ వుడ్ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి.

Tags

Next Story