Alyssa Healy: మహిళల క్రికెట్లో ముగిసిన ఓ శకం

మహిళల క్రికెట్ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం ఆటగాళ్లుగా మాత్రమే కాకుండా, ఒక యుగానికి ప్రతీకలుగా నిలిచిపోతాయి. ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేరు అలీసా హీలీ. దూకుడైన బ్యాటింగ్, అద్భుత కీపింగ్, నాయకత్వ లక్షణాలు.. ఈ మూడింటి సమ్మేళనంగా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ను దశాబ్దకాలంగా ముందుకు నడిపించిన హీలీ, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ తన కెరీర్లో చివరిదని ఆమె వెల్లడించడంతో, మహిళల క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. 16 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన అంతర్జాతీయ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ చెప్పిన మాటలు, క్రీడాకారిణిగా ఆమె పరిపక్వతను చాటుతున్నాయి. “ఇంకా ఆడగలనేమో” అన్న భావన ఉన్నా, “ఇంతకాలం నన్ను ముందుకు నడిపించిన పోటీ తత్వం ఇప్పుడు తగ్గిందని” నిజాయితీగా ఒప్పుకోవడం... దిగ్గజాలకు మాత్రమే సాధ్యమయ్యే నిర్ణయం ఇది. కొన్ని నెలలుగా రిటైర్మెంట్పై ఆలోచిస్తున్నానని, శారీరకంగా–మానసికంగా అలసట పెరిగిందని అలీసా హీలీ చెప్పిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి.
హీలీ ఓ దిగ్గజం
2010లో టీనేజర్‌గా ఆస్ట్రేలియా మహిళల జట్టుకు వికెట్‌కీపర్‌గా అరంగేట్రం చేసిన హీలీ, అతి తక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకరిగా మారింది. ఆ సమయంలో మహిళల క్రికెట్లో వికెట్‌కీపర్ పాత్ర ఎక్కువగా “సపోర్టింగ్ క్యాస్ట్”గానే భావించబడేది. కానీ హీలీ ఆ నిర్వచనాన్నే మార్చింది. ఓపెనర్‌గా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ, మ్యాచ్ దిశను తొలి పది ఓవర్లలోనే మార్చగల ఆటగాళ్లలో ఆమె ఒకరిగా నిలిచింది. మెగ్ లానింగ్ నాయకత్వంలోని స్వర్ణయుగంలో హీలీ చాలా కాలం వైస్ కెప్టెన్‌గా కీలక బాధ్యతలు నిర్వహించింది. 2023లో ఆమెకు పూర్తి స్థాయి కెప్టెన్సీ అప్పగించినప్పుడు, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో ఒక సహజమైన మార్పు కనిపించింది. కెప్టెన్‌గా ఆమె సాధించిన ఘనతల్లో ఇంగ్లాండ్‌పై 16-0తో సాధించిన చారిత్రక వైట్‌వాష్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది కేవలం సిరీస్ విజయం కాదు, ఆస్ట్రేలియా ఆధిపత్యానికి మరో ముద్ర.
ఎన్నో రికార్డులు
అలీసా హీలీ కెరీర్ గణాంకాలు ఆమె స్థాయిని స్పష్టంగా వివరిస్తాయి. దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు, అన్ని ఫార్మాట్లలో కలిపి 7,000కు పైగా పరుగులు, మహిళల టీ20 అంతర్జాతీయాల్లో వికెట్‌కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్ ఇవి సంఖ్యలు మాత్రమే. కానీ హీలీ ప్రభావం గణాంకాలకు అతీతం. వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లలో ఆమె ఒకరు. మొత్తం మీద ఆమె 8 ఐసీసీ వరల్డ్‌కప్ విజేత జట్లలో సభ్యురాలిగా నిలవడం, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ ఎంత స్థిరంగా, శక్తివంతంగా కొనసాగిందో సూచిస్తుంది. 2019లో ఆమెకు లభించిన ప్రతిష్టాత్మక బెలిండా క్లార్క్ అవార్డు, రెండు సార్లు ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు... ఈ గౌరవాలు ఆమె గొప్పతనానికి అధికారిక ముద్రలు. హీలీ రిటైర్మెంట్ ప్రకటనలో అత్యంత ప్రభావవంతమైన అంశం ఆమె నిజాయితీ. “గత కొన్ని సంవత్సరాలు శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయాను. గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. ఇంతకు ముందు లాగ ఆ శక్తిని తిరిగి తెచ్చుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది” అని అలీసా హీలీ చెప్పిన మాటలు, నేటి ప్రొఫెషనల్ క్రికెట్ ఎంత కఠినమైందో తెలియజేస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

