AUS vs IND: సమం చేస్తారా..? సమర్పించేస్తారా.?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై అందరి దృష్టీ నిలిచింది. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ దిగ్గజాలు పెర్త్‌లో విఫలమైనప్పటికీ, నేడు అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, అడిలైడ్ ఓవల్ మైదానం విరాట్ కోహ్లీకి అచ్చొచ్చిన వేదిక కావడంతో అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. . పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో సిరీస్ 0-1తో వెనకబడి పోయింది. అయితే తొలి వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం.. ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ముందు టీమిండియా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది.
సిరీస్‌లో నిలవాలంటే రెండో వన్డేలో భారత్ తప్పక గెలవాల్సిందే. గురువారం ఆడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిరాశపరిచారు. అయినప్పటికీ వారిద్దరూ తుది జట్టులో కొనసాగనున్నారు. మరోవైపు తొలి వన్డేలో బెంచ్‌కు పరిమితమైన కుల్దీప్ యాదవ్ .. తుది జట్టులోకి రానున్నాడు. అతడిని ఎందుకు పక్కన పెట్టారని ఇప్పటికే మాజీల నుంచి ప్రశ్నలు వచ్చాయి. అదీ కాకుండా భారత బౌలర్లు తేలిపోవడంతో కుల్దీప్ లాంటి వికెట్ టేకర్ అవసరమైన డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ కోసం వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసే అవకాశం ఉంది. మరోవైపు తొలి వన్డేలో తేలిపోయిన పేసర్ హర్షిత్ రాణా సైతం బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
రో-కో ఏం చేస్తారో...
గత రికార్డులు పరిశీలిస్తే అడిలైడ్‌ను కోహ్లీకి కంచుకోటగా చెప్పవచ్చు. ఈ మైదానంలో ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన కోహ్లీ, 61 సగటుతో 244 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. కేవలం వన్డేల్లోనే కాకుండా, టెస్టుల్లోనూ ఇక్కడ అతడి రికార్డు అద్భుతంగా ఉంది. ఐదు టెస్టు మ్యాచ్‌లలో 53.70 సగటుతో 537 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లు కలిపి అడిలైడ్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్, 65 సగటుతో 975 పరుగులు చేసి ఐదు శతకాలు నమోదు చేశాడు. మరోవైపు రోహిత్ శర్మకు మాత్రం ఈ మైదానంలో సాధారణ రికార్డే ఉంది. ఇక్కడ ఆడిన ఆరు వన్డేల్లో 21.83 సగటుతో కేవలం 131 పరుగులే చేశాడు.
పెర్త్‌లో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్‌లో రోహిత్ 8 పరుగులకే వెనుదిరగ్గా, కోహ్లీ ఎనిమిది బంతులు ఆడి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే ఈ ప్రదర్శనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఆస్ట్రేలియాలోనే అత్యంత బౌన్స్ ఉండే పిచ్‌పై వారు ఆడారు. చాలా నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వారికి అది అంత సులభం కాదు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి రెగ్యులర్ ఆటగాళ్లకే అక్కడ సవాల్ ఎదురైంది" అని గవాస్కర్ వివరించారు. ఈ మ్యాచులో గెలిచి భారత్ పోటీలో ఉండాలని గవాస్కర్ అభిలాషించాడు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com