Axar Patel : అక్షర్ పటేల్‌కు గాయం.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం...

Axar Patel : అక్షర్ పటేల్‌కు గాయం.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం...
X

ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతని తల నేలకు తాకడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా రింకు సింగ్ వచ్చాడు. ఈ సంఘటన అభిమానుల్లో ఆందోళన కలిగించింది. సూపర్-4 దశకు ముందు అక్షర్ గాయపడటం జట్టుకు పెద్ద నష్టమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అక్షర్‌కు పెద్దగా ప్రమాదం ఏం జరగలేదని.. ప్రస్తుతం బాగానే ఉన్నాడని వెల్లడించారు. అయినప్పటికీ మరింత స్పష్టత కోసం అతనికి స్కానింగ్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. స్కానింగ్‌లో ఎలాంటి సమస్య లేకపోతే అక్షర్ మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడవచ్చు. లేకపోతే అతని స్థానాన్ని మరొకరు భర్తీ చేయాల్సి ఉంటుంది.

అక్షర్ స్థానంలో ఎవరు?

సూపర్-4లో భారత్ ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది. అక్షర్ అందుబాటులో లేకపోతే, టీమ్‌ఇండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో బరిలోకి దిగాల్సి వస్తుంది. వీరు ఇప్పటికే మంచి రిథమ్‌లో ఉన్నారు. అయితే అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదు. ఒకవేళ అతను టోర్నీకి దూరమైతే, స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఒమన్ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న ప్రధాన బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అక్షర్ లేకపోతే, బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి రింకు సింగ్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.

Tags

Next Story