BCCI: భారత్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

అనుకున్నదే జరిగింది. ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మధ్య వైట్-బాల్ సిరీస్ వాయిదా పడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ పరస్పర అంగీకారంతో ఈ సిరీస్‌ను ఆగస్టు 2025 నుంచి సెప్టెంబర్ 2026కి వాయిదా వేసినట్లు ప్రకటించాయి. వాస్తవానికి ఆగస్టు 17 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఈ పర్యటనతో ముందుకు వెళ్లవద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సిరీస్‌పై కొన్ని సందేహాలు నెలకొన్నాయి. “ఇరు బోర్డుల మధ్య చర్చల తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, జట్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. పర్యటనకు సంబంధించి సవరించిన తేదీలు, మ్యాచ్‌ల వివరాలు త్వరలో ప్రకటిస్తాం” అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.
రోకో కోసం ఎదురుచూపులు
ఐకానిక్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడాన్ని చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే, వారు టీ20 అంతర్జాతీయ, టెస్ట్ క్రికెట్ల నుండి రిటైర్ అయిన తర్వాత కేవలం వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించారు. 2027 ప్రపంచ కప్ వారి టార్గెట్. వాస్తవానికి, ఆగస్టు 2025లో జరగాల్సిన ఈ వైట్-బాల్ సిరీసుతో వారి రీఎంటీ ఇస్తారని భావించారు. కానీ, సిరీస్ ఇప్పుడు సెప్టెంబర్ 2026కి వాయిదా పడటంతో ‘రో-కో’ మ్యాజిక్‌ను మళ్లీ చూడటానికి అభిమానులు మరింత ఓపిక పట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com