BCCI: గ్రేడ్ బీలో టీమిండియా మాజీ కెప్టెన్లు

భారత క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించిన తాజా వార్షిక ఒప్పందాల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జాబితాలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోవడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రేడ్-ఏ నుంచి గ్రేడ్-బీకి మారడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. తాజా ఒప్పందాల ప్రకారం, గ్రేడ్-ఏ విభాగంలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బూమ్రా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. గ్రేడ్-బీ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లను బీసీసీఐ చేర్చింది. ఇక గ్రేడ్-సీ జాబితాలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్ సహా మొత్తం 16 మంది ఆటగాళ్లు చోటు సంపాదించారు.
ఇప్పటివరకు గ్రేడ్-ఏలో కొనసాగిన రోహిత్, కోహ్లీలను గ్రేడ్-బీకి మార్చడం వెనుక స్పష్టమైన కారణం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో ఆడటం లేదు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీరు, టెస్ట్ క్రికెట్‌కూ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీసీఐ ఒప్పందాల నిబంధనల ప్రకారం, అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడే కీలక ఆటగాళ్లకే గ్రేడ్-ఏలో స్థానం లభిస్తుంది. ఈ కారణంగానే పరిమిత ఫార్మాట్లకే పరిమితమైన రోహిత్, కోహ్లీలను గ్రేడ్-బీకి కేటాయించినట్లు సమాచారం. ఈ మార్పు వారి స్థాయి తగ్గింపుగా కాకుండా, కేవలం ఫార్మాట్‌ల ఆధారంగా తీసుకున్న పరిపాలనా నిర్ణయమని బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయంతో అభిమానుల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. రానున్న వన్డే ప్రపంచకప్ వరకు ఈ ఇద్దరు కొనసాగుతారా? లేక భవిష్యత్ ప్రణాళికల్లో మార్పులున్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక స్పష్టత రాకపోయినా, ప్రస్తుతానికి ఇది ఒప్పందాల నిబంధనల ప్రకారమే తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
