CAPTAIN: భారత టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

CAPTAIN: భారత టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
X
ఇంగ్లాండ్ పర్యటనకు జట్టు ప్రకటన... గిల్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించిన సెలెక్టర్లు

కొన్ని రోజులుగా భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపిన టెస్టు జట్టు కెప్టెన్సీకి తెరపడింది. భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. టీమిండియా టెస్టు క్రికెట్‌కు కొత్త సారథి వచ్చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ భావించినట్లుగానే టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్‌కు అప్పగించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్టు జట్టును ప్రకటించాడు. ఈ ప్రకటనతో పాటు అందరూ ఊహించినట్లుగానే యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కెప్టెన్సీ మార్పు అనివార్యమైంది. చ్చే నెలలో ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సారథిగా శుభ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ను తీసుకుంది. 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. జూన్‌ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుంది.

గిల్ కెప్టెన్... పంత్ వైస్ కెప్టెన్...

గిల్‌కు డిప్యూటీగా రిషభ్ పంత్ ఉంటాడని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పేర్కొన్నాడు. కీపర్‌గా పంత్‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వగా, రెండో ప్రాధాన్య వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. గిల్ కెప్టెన్సీలో టీమిండియా 2025-2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసును ఈ ఇంగ్లాండ్ సిరీస్‌తోనే ప్రారంభించనుంది.

సీనియర్లను కాదని...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమయ్యింది. గిల్, పంత్, బుమ్రా, కెఎల్ రాహుల్‌లు కెప్టెన్సీ పోటీలో నిలిచారు. కానీ సెలెక్టర్లు యంగ్ ప్లేయర్ గిల్‌ వైపే మొగ్గుచూపారు. జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ఉన్నా, గాయం, వర్క్‌లోడ్ కారణంగా వైదొలిగారు. రోహిత్-కోహ్లీ తప్పుకున్న తర్వాత యువ ఆటగాళ్లతో కొత్త యుగం ప్రారంభమైంది.

భారత జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్.

Tags

Next Story