CRICKET: కోహ్లీ రిటైర్మెంట్.. వద్దంటున్న స్టార్లు

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. దీని నుంచి తేరుకునేలోపే మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తుండడం అభిమానులకు మింగుడు పడడం లేదు. కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన ముంగిట ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోహ్లీని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. భారత మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీ ఇప్పుడే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకొద్దని కోరుతున్నారు. అనుభవజ్ఞుడైన కోహ్లీ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు కీలకమవుతాడని పేర్కొన్నారు. **ఇంగ్లండ్ సిరీస్‌లో అయినా ఆడాలని కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని అటు మాజీలు, ఇటు అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో విరాట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
ఇది సందర్భం కాదు: సిద్ధు
విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వాలనుకుంటున్నాడని... అతను తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిందని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అతని ఉద్దేశం సరైనది, గొప్పదని.. పాతతరం తప్పుకొని కొత్తతరానికి అవకాశం కల్పించాలని కోరాడు. కానీ ఇదీ సరైన సమయం, సందర్భం కాదని... సవాలుతో కూడిన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్నామని సిద్దూ అన్నాడు. టెస్టు క్రికెట్ ఆడే ఇతర దేశాలు కూడా అక్కడ గెలవడం కష్టమని... ఇంగ్లాండ్ టూర్‌లో టీమ్ఇండియాకు కోహ్లీ ఆపద్బాంధవుడు అవుతాడని సిద్ధూ అన్నాడు. ఎందుకంటే అతను అనుభవజ్ఞుడని తెలిపాడు. రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడని.. ఇలాంటి తరుణంలో అనుభవం లేని జట్టును ఇంగ్లాండ్‌కు పంపొద్దని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వెల్లడించాడు.
కోహ్లీ.. బబ్బర్ కా షేర్: కైఫ్
విరాట్ కోహ్లీ హిందుస్థాన్ కా బబ్బర్ షేర్ అని, అతడు తన టెస్ట్ కెరీర్‌ను టీ20 కెరీర్ మాదిరి ఉన్నతంగా ముగించాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. ‘హిందూస్థాన్ సింహమైన విరాట్ కోహ్లీ ఇప్పుడు రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నాడు. అతను రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడే రిటైర్ అవ్వకుండా.. ఇంగ్లండ్ వెళ్లి తానేంటో నిరూపించుకోవాలని కైఫ్ సూచించాడు. టెస్ట్ టెస్ట్ కెరీర్‌ను విరాట్ ఉన్నతంగా ముగించాలని... టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి పొట్టి ఫార్మాట్ కెరీర్‌ను ఉన్నత స్థాయిలో ముగించాడన్నారు. అదే మాదిరి ఇప్పుడు చేయాలని కైఫ్ చెప్పుకొచ్చాడు.
రాయుడు భావోద్వేగ విజ్ఞప్తి
కోహ్లీని రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించమని కోరుతూ మాజీ సహచరుడు అంబటి రాయుడు భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశాడు. “దయచేసి విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వకండి… భారత జట్టుకు మీ అవసరం ఎప్పుడూ లేనంతగా ఉంది. మీ సామర్థ్యం ఇంకా చాలా ఉంది. టీం ఇండియా కోసం మీరు పోరాడకుండా టెస్ట్ క్రికెట్ ఒకేలా ఉండదు… దయచేసి పునఃపరిశీలించండి” అంటూ రాయుడు సామాజిక మాధ్యమం వేదికగా కోహ్లీకి సందేశం పంపారు.
క్రికెట్ లెజెండ్ లారా సూచన
టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ కావాలి. రిటైర్మెంట్ ఆలోచన వెనక్కి తీసుకోవాలని అతన్ని ఒప్పించబోతున్నారు. అతను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదు. తన మిగిలిన టెస్టు కెరీర్‌లో సత్తా చాటుతాడు. 60 కంటే ఎక్కువ సగటునే కలిగి ఉంటాడు’ - బ్రియాన్ లారా సూచించాడు. టీమిండియాకు కోహ్లీ అవసరం ఉందని.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతడు ఆపద్భాందవుడిలా ఉంటాడని పేర్కొంటున్నారు. పాతతరం తప్పుకొని.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే కోహ్లీ నిర్ణయం గొప్పదే అయినా.. ఇది సరైన సమయం కాదని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com