CRICKET: శతక్కొటిన స్మృతి మంధాన

CRICKET: శతక్కొటిన స్మృతి మంధాన
X
ట్రై సిరీస్ భారత్ కైవసం

భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. అదిరే ప్రదర్శనతో ట్రై సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా, శ్రీలంకలతో జరిగిన సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను మట్టికరిపించి టీమిండియా విజేతగా నిలిచింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం నమోదు చేసింది. టోర్నీలో అయిదు మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు విజయాలు సాధించి ఫైనల్ చేరింది. ఫైనల్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక, భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక తేలిపోయింది. భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ప్రత్యర్థి 48.2 ఓవర్లలో 245 పరుగులకే కుప్పకూలింది.

మంధాన సెంచరీ

భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. మంధాన లంక బౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్‌గా వచ్చిన స్మృతి 32 ఓవర్లపాటు క్రీజులో ఉంది. సెంచరీతో కదం తొక్కి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. 101 బంతుల్లో 116 స్కోరు చేసిన మంధాన.. 15 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. వన్డేల్లో ఆమెకు ఇది 11వ శతకం. మిగతా బ్యాటర్లు కూడా జోరు కొనసాగించారు. హర్లీన్ డియోల్(47), రోడ్రిగ్స్(44), హర్మన్‌ప్రీత్(41) కూడా సత్తాచాటారు. దీంతో పరుగుల వరద పారించిన భారత్ 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది. స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్ బంతితో విజృంభించారు. స్నేహ్ రాణా 4 వికెట్లు, అమన్‌జోత్ 3 వికెట్లతో సత్తాచాటారు. దీంతో శ్రీలంక జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు.భారత బౌలర్ల ధాటికి లంక జట్టు కోలుకోలేకపోయింది. కెప్టెన్ ఆటపట్టు(51), నీలాక్షి డి సిల్వ(48) మాత్రమే పోరాడగా.. మిగతా వారు విఫలమయ్యారు.

Tags

Next Story