CT2025: భారత్ కు స్పిన్ సవాల్

CT2025: భారత్ కు స్పిన్ సవాల్
X
న్యూజిలాండ్ తో నేడు ఆసక్తికర సమరం... దృష్టంతా భారత బ్యాటర్లపైనే

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ ఓటమే ఎరుగని టీమిండియా-న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచుతో గ్రూప్ ఏ టాపర్ ఎవరో తేలనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సెమీ ఫైనల్లో ఏ జట్టు ఎవరితో ఆడనుందో తెలియనుంది. ఈ మ్యాచుతో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచులో గెలిచి ఆత్మ విశ్వాసంతో సెమీస్ లో అడుగు పెట్టాలని రోహిత్ సేన చూస్తోంది.

స్పిన్ గండాన్ని దాటేస్తారా..?

న్యూజిలాండ్ తో జరిగే ఈ మ్యాచులో లోపాలను అధిగమించాలని టీమిండియా భావిస్తోంది. ఈ పోరు ద్వారా స్పిన్నర్లపై తమ ఆటతీరును మరింత మెరుగుపరుచుకోవాలని భారత బ్యాటర్లు భావిస్తున్నారు. ఈ ఛాంపియన్స్ టోర్నీలో స్పిన్‌ ఆడడంలో టీమిండియా బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. స్పిన్నర్లను ఆచితూచి ఆడారు. కివీస్‌పై ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. బంగ్లాతో పోరులో స్పిన్నర్లు మెహదీ హసన్‌, రిషాద్‌ లను ఆచితూచి ఆడిన భారత బ్యాటర్లు... పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులోనూ ఎలాంటి సాహసాలు చేయలేదు. బలమైన స్పిన్ విభాగం ఉన్న కివీస్ ను టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కివీస్‌ స్టార్‌ స్పిన్నర్లు శాంట్నర్‌, బ్రేస్‌వెల్‌, ఫిలిప్స్ లను ఎలా ఆడతారో వేచి చూడాలి. రిషబ్ పంత్ తుదిజట్టులో ఉంటాడని భావిస్తున్నారు. స్పిన్ విభాగంలో భారత్ కూడా బలంగానే ఉంది. జడేజా, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్‌ల రూపంలో అయిదుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు.

భారీ అంచనాలు

ఈ మ్యాచులో టీమిండియా బ్యాటర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, కోహ్లీ, గిల్ మంచి ఫామ్ లో ఉన్నారు. పాక్ తో మ్యాచులో సెంచరీ చేసిన కోహ్లీపై భారీ అంచనాలే ఉన్నాయి. 300వ వన్డేలో కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. కివీస్‌కు మ్యాచ్‌ హెన్రీ, ఒరౌర్క్‌ల రూపంలో నాణ్యమైన పేస్‌ జోడీ కూడా ఉంది. వీరికి ఆరంభ ఓవర్లలో భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోవడం కీలకం. ఈ మ్యాచ్‌కు పేసర్‌ షమికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్‌తో పోరులో షమి కండర నొప్పితో ఇబ్బందిపడ్డాడు. పైగా..న్యూజిలాండ్‌ జట్టులో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లున్నారు. దాంతో ఎడమ చేతి పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు చోటు కల్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దుబాయ్‌ పిచ్‌లన్నీ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నాయి.

Tags

Next Story