WWC 2025: మన అమ్మాయిలు... విశ్వ విజేతలు

మన అమ్మాయిలు సాధించారు. దశాబ్దాలుగా అందని కలలా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను ఒడిసిపట్టి జగజ్జేతలుగా నిలిచారు. రెండుసార్లు అందకుండా పోయిన వన్డే ప్రపంచకప్ టోర్నీని ముచ్చటగా మూడోసారి ఒడిసి పట్టారు. సొంతగడ్డపై తొలిసారిగా ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు. వందకోట్ల మంది కన్న కలను.. పదిహేను మంది ప్లేయర్లు సాకారం చేశారు. ప్రతి ఇల్లు, వీధి, నగరం, రాష్ట్రం.. తేడాలేకుండా ప్రజలంతా తమ కల నెరవేరినందుకు సంబరాల్లో మునిగిపోయారు. తరతరాల నిరీక్షణకు తెరపడిన ఈ క్షణాన్ని దేశం ఎన్నటికీ మరువదు. 1983లో కపిల్ డెవిల్స్ సాధించిన విజయం తర్వాత.. 2025లో కౌర్ సేన గెలుపు.. దేశంలో క్రికెట్ రూపురేఖలు మార్చిందని చరిత్ర చెప్పుకోవడం ఖాయం. ఆ చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేసిన ఈ అమ్మాయిల జట్టును కూడా దేశం మరువదు.. మరువలేదు. ఎంతగొప్పగా ఆడుతున్నా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ లేకపోవడం ఈ టీంకు ఇంతకాలం మనసును మెలిపెట్టే వెలితి. ఆ బాధ తీరిన రోజు ఇది. ఐసీసీ టోర్నీల్లో వైఫల్యాలు చూసి చోకర్స్ అనే ముద్రను చెరిపేసి తాము చోకర్స్ కాదు విన్నర్స్ అని టీమిండియా చాటి చెప్పింది. ఆట ఏదైనా ప్రపంచకప్ అంటే.. ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారీ నిరాశే. ఈసారి మాత్రం ఆ ఆశ నెరవేరింది.
అద్భుత పోరాటంతో...
టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా.. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం.. 27 ఓవర్లకు స్కోరు 162/1.. ఆ ఊపు చూస్తే 350 కొట్టేయబోతున్నాం, కానీ చివరికి చూస్తే లక్ష్యం 299 పరుగులే. సెమీఫైనల్లో మన జట్టు ఛేదించిన స్కోరు కంటే ఇది 40 తక్కువే. ఈ స్కోరును కాపాడుకోగలరా అన్న అనుమానం! కెప్టెన్ ముందుండి నడిపించగా సఫారీ జట్టు 39 ఓవర్లకు 207/5తో నిలిచిన సమయాన లోలోన గుబులు! కానీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదని చాటుతూ.. తమది సిసలైన ఛాంపియన్ జట్టని రుజువు చేస్తూ.. హర్మన్‌ప్రీత్ సేన ఒక్కసారిగా జూలు విదిల్చింది. పదకొండు మందీ ప్రాణం పెట్టి ఆడగా.. జట్టంతా చేయి చేయి కలిపి సమష్టిగా కదలగా.. కలల కప్పును ఒడిసిపట్టింది.
తెలుగు అమ్మాయిలు
వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లున్నారు. వీరే శ్రీచరణి, అరుంధతి రెడ్డి. వీరిలో శ్రీచరణి.. టోర్నీ ఆసాంతం అద్భుతమైన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నది. వరల్డ్ కప్‌లో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీప్తి శర్మ తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. అరుంధతికి మాత్రం ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కలేదు. టోర్నీ ఆసాంతం బెంచ్‌కే పరిమితమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

