Rajiv Shukla Reacts : కోహ్లీ, రోహిత్‌ల ఫేర్‌వెల్‌ గురించి మాట్లాడొద్దు

Rajiv Shukla Reacts : కోహ్లీ, రోహిత్‌ల ఫేర్‌వెల్‌ గురించి మాట్లాడొద్దు
X

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు త్వరలో వీడ్కోలు పలుకుతారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెటర్లు రిటైర్‌మెంట్ తీసుకోవాలని బీసీసీఐ ఎప్పుడూ చెప్పదని, అది ఆటగాడి వ్యక్తిగత నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న శుక్లా ముందు ఈ రిటైర్‌మెంట్ అంశాన్ని ఉంచగా, ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘ రోహిత్, విరాట్ ఇప్పటికీ వన్డేల్లో ఉన్నారు. ఇంకా ఆడుతున్నారు కదా.. అప్పుడే ఫేర్‌వెల్ గురించి మాట్లాడటం ఎందుకు? మీలాంటి వారందరూ ఎందుకు కంగారుపడుతున్నారో అర్థం కావడం లేదు. బీసీసీఐ ఎవరినీ రిటైర్‌మెంట్ తీసుకోండని చెప్పదు. మా పాలసీ స్పష్టంగా ఉంటుంది. ఏ ప్లేయర్‌ను కూడా వెళ్లిపోమ్మని చెప్పదు. ఆటగాడే స్వతహాగా నిర్ణయం తీసుకుంటాడు. దానిని ఎవరైనా గౌరవించాల్సిందే’’ అని రాజీవ్ శుక్లా అన్నారు.

ఇప్పటికీ వారు ఫిట్‌గా ఉన్నారు

కోహ్లీ, రోహిత్‌ల ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. ‘‘బ్రిడ్జ్‌ ఎదురుగా వచ్చినప్పుడే ఎలా క్రాస్ చేయాలనే దానిపై మాట్లాడుకుంటాం. కోహ్లీ ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ ఇంకా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ మీలాంటివారు మాత్రం ఫేర్‌వెల్ అడుగుతారు’’ అసహనం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్, విరాట్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags

Next Story