CT2025: దాయాదుల సమరానికి సర్వం సిద్ధం

ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌కు టీమిండియా-పాకిస్థాన్ సిద్ధమయ్యాయి. టీమిండియా తమ మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌పై గెలిచి మంచి ఊపులో ఉంది. టోర్నమెంట్ కంటే కూడా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌పైనే భారత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీ అంతా ఒకెత్తు అయితే.. దాయది దేశం పాకిస్తాన్‌తో భారత్ తలపడనున్న మ్యాచ్ మరో ఎత్తు. బంగ్లాతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు తన రెండవ మ్యాచ్‌లో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
పైచేయి పాకిస్తాన్‌దే
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లలో భారత్ బలంగా కనిపించినా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాకిస్థాన్ టీమ్‌దే పైచేయిగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లో పాక్ మూడు మ్యాచుల్లో గెలుపొందింది. ఇందులో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించింది. మొత్తంగా భారత్-పాక్ మధ్య మొత్తం 134 వన్డే మ్యాచులు జరిగాయి. వీటిలో భారత్ 56 మ్యాచులు గెలుపొందగా.. పాక్ 73 మ్యాచుల్లో విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో రిజల్ట్ తేలలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి మ్యాచ్‌లో పాక్ పేలవ ప్రదర్శన కనబర్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 320 టార్గెట్‌ను పాక్ చేదించలేకపోయింది. కేవలం 260 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ పెర్ఫామెన్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇరు జట్లకు కీలకమే
ఫిబ్రవరి 23, ఆదివారం జరిగే ఈ మ్యాచ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు డూ ఆర్ డై లాంటింది. ఓడితే పాక్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఇక భారత్ గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది.
పిచ్ ఎలా ఉంటుందంటే..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ సాధారణంగా స్లో ట్రాక్‌లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ పిచ్‌పై కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల పనిభారం కూడా పెరుగుతుంది. అంటే మొత్తంగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ఆరంభంలోనే వికెట్లు తీసుకుంటే వారిపై భారం తగ్గుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com