U-19 WC: మనమ్మాయిలు... జగజ్జేతలు

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 83 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్, తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష (44*) భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. 2023లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టోర్నీలో గెలిచి మొదటిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు... ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా తన టైటిల్ ను నిలబెట్టుకుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్లతో విజయం సాధించింది. టాస్ నెగ్గి, తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులకు ఆలౌటైంది. SA జట్టులో మీకే వాన్ వూరస్ట్ 23, మ్మా బోథా 16, ఫే కౌలింగ్ 15 టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో త్రిష 3, ఆయుషీ శుక్లా, వైష్ణవీ శర్మ, పరుణికా సిసోదియా తలో రెండు, షబ్నామ్ ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనను భారత్ 11.2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 84 పరుగులు చేసి పూర్తి చేసింది. బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ రాణించిన త్రిష జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
అదరగొట్టిన తెలుగమ్మాయి
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవడంతో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 44 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన త్రిష మొత్తం 309 రన్స్ చేసింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. కాగా.. ఈ WCలో అత్యధిక పరుగులు కూడా త్రిషవే. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ ఆసాంతం అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డునూ సొంతం చేసుకుంది. ఆమె 309 పరుగులతో ప్రపంచకప్‌లో టాప్‌స్కోరర్‌గా నిలవడమే కాక ఏడు వికెట్లూ పడగొట్టింది.
ఎక్కడా తగ్గలే.. కప్పును వదల్లే
అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో.. టీమిండియా ఆధిపత్యం మరోసారి కొనసాగింది. ఒక్క పరాజయం కూడా లేకుండానే యువ భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. తొలి ప్రపంచకప్‌ను టీమిండియానే దక్కించుకుంది. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి.. సాధికార విజయాలతో కప్పును ఒడిసిపట్టింది. దీంతో యువ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com