gill: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. సెనా దేశాల్లో కెప్టెన్‌గా డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా క్రికెటర్ గా అలాగే టెస్ట్, వన్డే రెండు ఫార్మాట్లలో డబుల్ సెంచరీలు చేసిన కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ సాధించిన ఈ డబుల్ సెంచరీ కేవలం భారతీయ కెప్టెన్ల రికార్డులలోనే కాదు.. ఆసియా క్రికెట్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. సెనా దేశాల్లో టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆసియా కెప్టెన్ గిల్ అయ్యాడు. ఇంతకుముందు, 2011లో లార్డ్స్‌లో 193 పరుగులు చేసిన తిలకరత్నే దిల్షాన్ కార్డు అగ్రస్థానంలో ఉండేది. కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయుడు కూడా గిల్‌నే. అయితే, ఇంగ్లండ్ గడ్డపై 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత గిల్ మూడవవాడు.
వన్డే, టెస్టుల్లో డబుల్ సెంచరీ
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కూడా అతడే. మొదటి మ్యాచ్‌లో కూడా అతను సెంచరీ సాధించి 147 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ డబుల్ సెంచరీతో కలిపి తను కేవలం మూడు ఇన్నింగ్స్ లలోనే 350కి పైగా పరుగులు సాధించడం విశేషం. శుభ్‌మన్ గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన టెస్ట్ కెరీర్లో మొదటి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ సమయంలో తన స్ట్రైక్ రేట్ 64.31గా ఉంది. ఇది టెస్ట్ క్రికెట్లో మంచి స్ట్రైక్ రేటుగా భావిస్తున్నారు. అంతేకాదు, గిల్ ఇప్పటికే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా డబుల్ సెంచరీని సాధించాడు. దీంతో టెస్ట్, వన్డే రెండు ఫార్మాట్లలోనూ డబుల్ సెంచరీలు సాధించిన అతి కొద్దిమంది ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. ఇంత వరకూ ఇంగ్లండ్ లో కేవలం ఇద్దరు భారతీయ బ్యాటర్లు మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. అది 1979లో సునీల్ గవాస్కర్, ఆ తర్వాత 2002లో రాహుల్ ద్రావిడ్. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో లెజండరీ ప్లేయర్ల స్థాయి ఫీట్ ను గిల్ సాధించాడు.
-కెప్టెన్ గా శుభ్ మన్ కు ఇది రెండో టెస్టు. తొలి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లోనే గిల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో భారత జట్టు ఓటమితో సెంచరీలకు తగిన ప్రతిఫలం లభించలేదనుకోవాల్సి వస్తోంది. గెలుపోటముల సంగతిని పక్కన పెడితే.. గిల్ కు కెప్టెన్సీనా అని చాలా మంది ఆశ్చర్యపోయిన పరిస్థితి నుంచి కేవలం రెండో టెస్టుతోనే కొత్త అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. భారత క్రికెట్ లో గిల్ శకం మొదలైందనే మాట వినిపిస్తూ ఉందిప్పుడు. విరాట్ కొహ్లీ రిటైర్మెంట్ తర్వాత.. అనే ప్రశ్నకు గిల్ సమాధానంగా మారుతూ ఉన్నాడిప్పుడు. ఈ డబుల్ సెంచరీతో ఇంగ్లండ్ వేదికగా ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా కూడా గిల్ నిలిచాడు. 387 బంతుల్లో గిల్ 269 పరుగులు సాధించాడు. రవీంద్రజడేజా, వాషింగ్టన్ సుందర్ లు గిల్ కు మంచి సహకారం అందించారు. గిల్ భారీ స్కోర్ తో టీమిండియా మొత్తంగా 587 పరుగులు సాధించింది. రెండో రోజు చివరి సెషన్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తన రెండో ఓవర్లోనే ఆకాష్ దీప్ రెండు వరస బంతుల్లో డకెట్, పోప్ లను పెవిలియన్ కు పంపించి ఫ్లాట్ పిచ్ పై భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించాడు. భారత కెప్టెన్‌గా డబుల్ సెంచరీ బాదిన రెండో పిన్నవయస్కుడిగా కూడా గిల్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 26 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1999లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 26 ఏళ్ల 189 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో మన్సూల్ అలీ ఖాన్ పటౌడీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ దివంగత క్రికెటర్ 23 ఏళ్ల 39 రోజుల వయసులో ఇంగ్లండ్‌తో 1964లో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com