IND VS AUS: రెండో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం

IND VS AUS: రెండో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం
X
రాణించిన రోహిత్, మరోసారి కోహ్లీ డకౌట్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఘోర ఓటమి పాలైంది. అడిలైడ్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆసీస్ భారత్ పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. అనంతరం 265 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా... రెండు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని సాధించింది. ఈ గెలుపుతో 3 మ్యాచుల సిరీస్ లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది. ఆసీస్ జట్టులో షార్ట్(74), కాన్లీ(61), ఓవెన్(36) పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందించారు. పెర్త్ లో జరిగిన మొదటి వన్డేలో కూడా భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మూడో వన్డే ఈనెల 29న సిడ్నీలో జరగనుంది.

రోహిత్ శర్మ సరికొత్త రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. 9180+ పరుగులు చేసి.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (9146)ని అధిగమించాడు. రోహిత్ కంటే ముందు.. సచిన్(15310), సనత్ జయసూర్య (12740), క్రిస్ గేల్ (10179), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (9200) వరుస నాలుగు స్థానాల్లో ఉన్నారు.

కొంపముంచిన అత్యుత్సాహం..

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అత్యుత్సాహం ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ కోల్పోయేలా చేసింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్లు చేసిన సూచనలు పట్టించుకోకుండా సేమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగిన గంభీర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసిస్తే.. భారత స్పిన్ ఆల్‌రౌండర్లు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు.

కోహ్లీపై చెరగని మరక

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. గురువారం తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్‌లో 4 బంతుల డకౌట్‌ను నమోదు చేశాడు. కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్‌లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్‌ కావడం ఇదే మొదటిసారి.

Tags

Next Story