IND VS NZ: టీమిండియా వశమా.. కివీస్ కైవసమా.?

భారత్–న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో కీలక మ్యాచుకు రంగం సిద్ధమైంది. నేడు జరగనున్న మూడో వన్డే ఈ సిరీస్‌కు ఫైనల్లా మారింది. తొలి వన్డేలో ఆధిపత్య ప్రదర్శనతో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో టీమ్ఇండియా పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేశాయి. ఇప్పుడు అందరి దృష్టి నిర్ణయాత్మక మూడో వన్డేపైనే ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్‌దే… ఓడితే న్యూజిలాండ్‌దే. ఈ కీలక సమయంలో టీమ్ఇండియాను అత్యంతగా కలవరపెడుతున్న అంశం బౌలింగ్. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన గత టెస్టు సిరీస్‌ను భారత్ త్వరగా మర్చిపోలేకపోతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన భారత్, ఆ పరాభవానికి ప్రతీకారంగా ఈసారి వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో బౌలింగ్ విభాగం నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా తొలి రెండు వన్డేల్లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
కలవరపెడుతున్న బౌలింగ్
తొలి రెండు వన్డేల్లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. ప్రధానంగా స్పిన్నర్లు. కివీస్ బ్యాటర్లు తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడుతున్నారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వారి బ్యాటింగ్ వ్యూహాత్మకంగా సాగుతోంది. డరిల్ మిచెల్ ముందుకు వస్తూ బంతి స్పిన్ కాకముందే దాడికి దిగుతున్నాడు. అతడి బంతులను డరిల్తో పాటు ఇతర బ్యాటర్లు అలవోకగా స్వీప్ చేస్తూ పరుగులు రాబట్టారు. కుల్దీప్ మాత్రమే కాదు.. మిగతా స్పిన్నర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. రెండు వన్డేల్లో కలిపి భారత స్పిన్నర్లు తీసింది రెండే వికెట్లు. ఆ రెండు కుల్దీప్ ఖాతాలో చేరాయి.
బ్యాటర్లను కట్టడి చేస్తున్నప్పటికీ రవీంద్ర జడేజా వికెట్లు పడగొట్టడంలో రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా కోటా పూర్తిచేయలేదు. రెండో మ్యాచ్‌లో అతడి స్థానంలో ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడు. ఇక్కడ పరిస్థితులపై పెద్దగా అనుభవం లేని కివీస్ స్పిన్నర్లే మెరుగైన ప్రదర్శన చేశారు. సిరీస్‌లో నిర్ణయాత్మక వన్డేకు వేదికైన ఇందౌర్ బ్యాటింగ్‌కు అనుకూలం. బౌలర్లు క్రమశిక్షణ తప్పితే బంతి బౌండరీలో దర్శనమివ్వడం ఖాయం. ఇక్కడ వికెట్లకు నేరుగా బంతులేస్తూ.. లెంగ్త్‌లో వైవిధ్యంతో బ్యాటర్లను కట్టడి చేయాలి. మరి ఈ మ్యాచ్‌కు భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలో దిగుతుందన్నది ఆసక్తికరం. నితీశ్ కుమార్ స్థానంలో ఆఫ్‌స్పిన్ వేయగల ఆయుష్ బదోనిని తుది జట్టులోకి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించొచ్చు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో బౌలింగే భారత్ విజయంలో కీలకపాత్ర పోషించబోతోంది.
ఈ పరిస్థితుల్లో భారత్ జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో ఆఫ్‌స్పిన్ వేయగల ఆయుష్ బదోనిని ఆడించే అవకాశాలు చర్చలో ఉన్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని, అదనపు బ్యాటింగ్ లోతు అవసరమైతే ఈ మార్పు ఉపయోగపడొచ్చు. అలాగే పేస్ విభాగంలోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్ష్ దీప్ తుది జట్టులోకి తీసుకురావచ్చు. కొత్త బంతితో స్వింగ్ సాధిస్తే ఆరంభంలోనే వికెట్లు పడగొట్టే అవకాశం ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

