IND vs SA: నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్

భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ నేటి నుంచి జరగనుంది. స్వదేశంలో సఫారీ జట్టుపై భారత్ ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత రెండు సిరీస్‌లనూ 3-0తో సొంతం చేసుకుంది. కానీ నిరుడు న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురికావడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. పైగా దక్షిణాఫ్రికా.. ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఎప్పుడూ లేనంత ధీమాతో పోటీకి సిద్ధమైంది. ఈ టెస్ట్ సిరీస్‌లో గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గిల్ భారత జట్టు టెస్ట్ పగ్గాలు చేజిక్కించుకున్న తర్వాత స్వదేశంలో ఇది రెండో సిరీస్. మొదటి సిరీస్‌లో భారత్, వెస్టిండీస్‌ను 2-0తో ఓడించి విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు టీమ్ఇండియా ముందు పెద్ద సవాలే ఉంది! టెస్టుల్లో ‘ఛాంపియన్లు’గా అవతరించిన దక్షిణాఫ్రికా జట్టుతో ప్రస్తుతం టీమ్ఇండియా తలపడాల్సి ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సఫారీ జట్టు నుంచి భారత్‌కు పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఈ సవాల్‌ను టీమిండియా ఎంతవరకు ఎదుర్కోగలదు అన్నదానిపై క్రికెట్ ప్రపంచంలో విస్తృత చర్చ జరుగుతోంది. బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా జట్టు అద్భుతాలు చేస్తోంది. 27 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తొలిసారి ఐసీసీ టైటిల్ నెగ్గింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. బవుమా కెప్టెన్సీలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా జట్టు 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అందులో 9 మ్యాచుల్లో విజయం సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన ఒక మ్యాచ్ మాత్రం వర్షం వల్ల డ్రాగా ముగిసింది. బవుమాకు ఉన్న ఈ ఘనమైన రికార్డ్ టీమ్ఇండియాను ఇబ్బందికి గురిచేస్తోంది!
అనధికార టెస్టుతో వార్నింగ్
బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికా ఏ జట్టుతో ఇటీవల ముగిసిన రెండో అనధికార టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు ఓటమి పాలైంది. భారత జట్టు నిర్దేశించిన 417 పరుగుల భారీ లక్ష్యాన్ని సఫారీలు 5 వికెట్లు కోల్పోయి అలవోకగా చేధించారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ విఫలమయ్యారు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. 417 రన్స్ లక్ష్య ఛేదనలో 25/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్లు జోర్డాన్ హెర్మన్ (123 బాల్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 91), లెసెగో సెనోక్వానే (77) ఇండియా బౌలర్ల దుమ్ము దులిపారు. సిరాజ్ (1/53), ఆకాశ్ దీప్ (1/106)ను లక్ష్యంగా చేసుకుని బౌండ్రీల వర్షం కురిపించారు.
ధ్రువ్ జురేల్‌కు బంపరాఫర్
ఇటీవలి కాలంలో ఇండియా-ఏ తరఫున ధ్రువ్ జురేల్ చూపిన అసాధారణ ప్రదర్శన ఆయనకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కేలా చేసింది. జురేల్ మెరుపు ఫామ్ కారణంగా సెలెక్టర్లు అతడిని విస్మరించలేకపోయారు. జురేల్ దేశవాళీ సీజన్ ఆరంభం నుంచి ఆడిన చివరి ఎనిమిది ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ, 40+ స్కోరు సాధించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా-ఏపై వరుసగా 132, 127 (నాటౌట్)* వంటి భారీ స్కోర్లు చేయడం అతడికి తుది జట్టులో బెర్త్ కన్ఫర్మ్ చేసింది. అయితే టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

