Ind vs Ban : భారత్ క్లీన్ స్వీప్ .. 7 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు

Ind vs Ban : భారత్ క్లీన్ స్వీప్ .. 7 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు

రెండో టెస్టులో టీమిండియా ఎవరూ ఊహించని ఘన విజయం సాధించింది. రెండురోజులపాటు ఆటనే సాగలేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం ఊహించడం కష్టమే. కానీ, భారత్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్‌ చేసింది. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (8), గిల్ (6)లు విఫలమైనప్పటికీ.. యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. ఈక్రమంలో మరో హాఫ్ సెంచరీని యశస్వి తన ఖాతాలో వేసుకున్నాడు. మరో మూడు పరుగులు అవసరమనగా.. యశస్వి జైస్వాల్ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌(4 నాటౌట్)తో కలిసి కోహ్లీ మరో వికెట్‌ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఓవర్‌నైట్ 26/2 స్కోరుతో చివరిరోజు ఆటను ప్రారంభించిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవిచంద్రన్ అశ్విన్ (3/50), రవీంద్ర జడేజా (3/34), జస్‌ప్రీత్ బుమ్రా (3/17), ఆకాశ్‌ దీప్ (1/20) దెబ్బకు బంగ్లా బ్యాటర్లు హడలెత్తిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మొమినల్ హక్‌ను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. లెగ్‌సైడ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ షాంటో (19)తో కలిసి షద్మాన్‌ ఇస్లామ్ (50) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. భారత బౌలర్లు విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో బంగ్లా వారిద్దరి వికెట్లను కోల్పోయింది. లిటన్ దాస్ (1), షకిబ్ (0) మెహిదీ హసన్ (9), తైజుల్ ఇస్లామ్‌ (0) విఫలమయ్యారు. ఆఖర్లో ముష్ఫికర్‌ రహీమ్‌ క్రీజ్‌లో పాతుకుపోయి భారత బౌలర్లను విసిగించాడు. ఖలెద్‌ (5 నాటౌట్)తో కలిసి దాదాపు ఆరు ఓవర్ల పాటు వికెట్ ఇవ్వలేదు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయాన్ని పొడిగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ముష్ఫికర్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌటైంది.

Tags

Next Story