T20 World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

T20 World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
X
ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం.. రాణించిన భారత బౌలర్లు

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 105 రన్స్ చేసింది. 106 పరుగులు లక్ష్యఛేదనలో భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షెఫాలి వర్మ 32, హర్మన్‌ప్రీత్‌ కౌర్ 29, జెమీమా రోడ్రిగ్స్ 23 పరుగులతో రాణించారు. కాగా, ఈ నెల 9వ తేదీన భారత్, శ్రీలంకను ఢీ కొట్టనుంది.

అదరగొట్టిన భారత బౌలర్లు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే పాక్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్ గుల్ ఫెరోజాను డకౌట్ చేసి రేణుకా సింగ్ టీమిండియాకు తొలి వికెట్ అందించింది. అనంతరం పాకిస్తాన్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉండడం.. బాల్ బ్యాట్‌పైకి రాకపోవడం బ్యాటర్లను చాలా ఇబ్బందులు పెట్టింది. భారత బౌలర్లు కూడా పిచ్ నుంచి లభించిన సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఐదో ఓవర్లో సిద్రా అమీన్‌ను (8) దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. రెంపాకిస్తాన్ బ్యాటర్లలో నిదా దార్ (28) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చివర్లో కెప్టెన్ ఫాతిమా సనా (13), నష్రా సంధు (6 వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకుని 19 పరుగులు మాత్రమే ఇచ్చింది. శ్రేయాంక పాటిల్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసుకుని కేవలం 12 పరుగులు ఇచ్చింది.

ఆచితూచి ఆడిన బ్యాటర్లు

106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (7) ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వెనుదిరిగింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (32), జెమీమా రోడ్రిగ్స్ (23) ఆచితూచి ఆడారు. షెఫాలీ వర్మ తన సహజ శైలికి భిన్నంగా నిదానంగా బ్యాటింగ్‌ చేసింది. కానీ కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో స్కోరింగ్ రేటు మందగించినా కొట్టాల్సిన స్కోరు తక్కువ కావడంతో ఎక్కువ భయపడాల్సిన అవసరం రాలేదు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. స్కోరు 61 పరుగులకు చేరిన అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో షెఫాలీ వర్మ అవుటైంది. కాసేపటికే జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ కూడా అవుటైంది. వరుస బంతుల్లో వీరిద్దరూ అవుట్ కావడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (29) పాకిస్తాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత్‌ను విజయం వైపు నడిపింది. చివర్లో హర్మన్ రిటైర్ అయినా భారత్ విజయం అప్పటికే ఖాయమైంది.

Tags

Next Story