IND VS NZ: అందరి కళ్లూ... ఆ దిగ్గజాలపైనే

IND VS NZ: అందరి కళ్లూ... ఆ దిగ్గజాలపైనే
X
న్యూజిలాండ్‌తో నేటి నుంచి వన్డే సిరీస్‌... మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ స్టార్ట్.. అందరి కళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మపైనే

భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. గుజరాత్‌లోని వడోదరలోని బీసీఏ మైదానం వేదికగా ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. భారత్‌లోనే మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారత జట్టు, టెస్టుల్లో ఎదురైన నిరాశను వన్డేలు, టీ20ల్లో విజయాలతో తుడిచిపెట్టేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. భారత జట్టుకు ఈ మ్యాచ్‌తో కొన్ని కీలక శుభవార్తలు అందాయి. మెడ నొప్పితో కొంతకాలం ఆటకు దూరమైన శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇదే మ్యాచ్‌తో అతడు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న శ్రేయస్ అయ్యర్ కూడా రీ-ఎంట్రీ ఇవ్వడం టీమ్ ఇండియాకు బలాన్ని చేకూర్చింది. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై తీవ్రంగా గాయపడి జట్టుకు దూరమైన అయ్యర్, విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను కూడా చాటుకున్నాడు. కివీస్‌పై అతడు ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది.

అందరి కళ్లు వారిపైనే

ఎప్పటిలాగే భారత బ్యాటింగ్ భారాన్ని రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ భుజాలపై మోస్తున్నారు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో భారత్ 2-1తో విజయం సాధించడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు శతకాలు, ఒక అర్ధశతకంతో మొత్తం 302 పరుగులు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ కూడా రెండు అర్ధశతకాలతో 146 పరుగులు చేసి జట్టుకు శుభారంభాలు అందించాడు. ఐపీఎల్‌కు ముందు రెండు నెలల విరామం ఉండటంతో, ఈ సిరీస్‌పై తమదైన ముద్ర వేయాలని ‘రో-కో’ జోడీ పట్టుదలగా ఉంది. బౌలింగ్ విభాగంలో కూడా భారత్‌కు ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకున్నాయి. చాలా రోజుల తర్వాత మహమ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. అతడితో పాటు యువ పేసర్లు, స్పిన్నర్లు కలిసి న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను కట్టడి చేయాలని టీమ్ ఇండియా ప్రణాళికలు వేస్తోంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. కొందరు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉండటం మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది.

కొత్తగా కివీస్

మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఈసారి కొంత కొత్తగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే సీనియర్ల సంఖ్య తగ్గింది. కేన్ విలియమ్సన్ సహా కొందరు అనుభవజ్ఞులు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. భారత్‌లో ఇప్పటివరకు ఆడిన అనుభవం లేని ఆటగాళ్లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఓపెనింగ్‌లో నిక్ కెల్లీ, పేస్ బౌలింగ్‌లో జాక్ ఫౌక్స్, మైకేల్ రే, భారత సంతతికి చెందిన స్పిన్నర్ ఆదిత్య అశోక్ వంటి కొత్త ముఖాలు కివీస్ జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్‌ నిర్వహిస్తున్నాడు. అతడి సారథ్యంలో బరిలోకి దిగుతున్న కివీస్‌కు అనుభవజ్ఞులైనఆటగాళ్ల అండ ఉంది. వీళ్లందరికీ భారత్‌లో ఆడిన అనుభవం ఉండటం న్యూజిలాండ్‌కు పెద్ద ప్లస్. ముఖ్యంగా మిచెల్, ఫిలిప్స్, కాన్వేలు భారత బౌలర్లకు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది.

Tags

Next Story