TeamIndia : గెలుపు దిశగా భారత్ .. సెంచరీలతో కదం తొక్కిన పంత్, గిల్

చెన్నై టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వెలుతురు లేని కారణంగా అరగంట ముందుగానే ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ శాంటో (51), షకీబ్(5)లు ఉన్నారు. భారత్ మరో 6 వికెట్లు తీస్తే గెలుస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే 357 పరుగులు చేయాల్సి ఉంది. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
బంగ్లాదేశ్ కు శుభారంభం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బ్యాటర్లు గట్టిగానే ప్రతిఘటించారు. జాకీర్ హుస్సేన్(33), షాదాబ్ ఇస్లామ్(35) తొలి వికెట్ కు 62 పరుగులు జోడించారు. ఈ జోడీని బుమ్రా విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హుస్సేన్ శాంటో అర్థ శతకంతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అయితే, సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ తీసుకోలేకపోయిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం రెచ్చిపోయాడు. వరుసగా మూడు వికెట్లు తీసి బంగ్లాను కష్టాల్లో నెట్టాడు.
సెంచరీలతో కదం తొక్కిన గిల్, పంత్
అంతకుముందు ఓవర నైట్ 81/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు రిషభ్ పంత్ (109, 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్, 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. పంత్‌కిది ఆరో శతకం కాగా, గిల్ ఖాతాలో ఐదోది. 124 బంతుల్లోనే సెంచరీ బాదిన పంత్, బంగ్లా బౌలర్ మెహిదీకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో గిల్‌తో నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. పంత్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ (22 నాటౌట్, 19 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. దీంతో భారత్, బంగ్లాదేశ్ కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com