IND vs pak: ఏసీసీ టోర్నీ.. భారత్-పాక్ మధ్య మూడు మ్యాచ్‌లు

సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో భారత్, పాకిస్థాన్ సెప్టెంబర్ 7న తలపడనున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 ఫార్మాట్‌లో 2022, 2023 తరహాలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్, పాకిస్థాన్ సూపర్-4లో క్వాలిఫై అయితే సెప్టెంబర్ 14న మరోసారి తలపడే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. భారత్, పాక్ ఫైనల్ చేరితే ఇరు జట్లు మూడోసారి తలపడతాయి. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌తో ఆసియాకప్ 2025 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన మోహ్‌సిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో భారత్ పాల్గొనదనే వార్తలు కూడా వచ్చాయి. పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడవద్దనే డిమాండ్ కూడా నెటిజన్ల నుంచి ఆ సమయంలో వ్యక్తమైంది. కానీ ముందస్తు ప్రణాళికల ప్రకారమే ఆసియాకప్ 2025 జరుగుతుందని, షెడ్యూల్ కూడా సిద్దమైందని ప్రచారం జరుగుతోంది. 21 రోజులపాటు సాగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉందని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. ఇక, ఈ మ్యాచ్‌లు జరిగితే క్రికెట్ అభిమానులకు పండుగే అని చెప్పుకోవచ్చు. భారత్-పాక్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ వేరుగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మ్యాచ్‌లు జరిగే చాన్స్‌లు తక్కువే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com