India : టెస్టు క్రికెట్‌లో భారత్‌ ప్రపంచ రికార్డులు

India : టెస్టు క్రికెట్‌లో భారత్‌ ప్రపంచ రికార్డులు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్లు అద్భుతం చేశారు. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ నుంచే దూకుడుగా ఆడేశారు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే 50+ పరుగులు జోడించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించిన జోడీగా టీమ్‌ఇండియా ఓపెనర్లు నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు బజ్‌బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్ - బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉండేది. వీరిద్దరూ 26 బంతుల్లో 50+ స్కోరు రాబట్టారు. ఇప్పుడు దీనిని రోహిత్-యశస్వి బద్దలు కొట్టారు.

ఒకవైపు తన ఓపెనింగ్‌ పార్టనర్ రోహిత్ (23: 11 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్) ఔటైనప్పటికీ యశస్వి మాత్రం జోరు తగ్గించలేదు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. పంత్ (28 బంతుల్లో), కపిల్ (30 బంతుల్లో), శార్దూల్ (31 బంతుల్లో) యశస్వి కంటే ముందున్నారు.

కేవలం 10.1 ఓవర్లలోనే భారత్‌ వంద పరుగుల మార్క్‌ను తాకింది. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్‌ తన రికార్డును అధిగమించడం విశేషం. ఇంతకుముందు కూడా టీమ్‌ఇండియా 2023లో విండీస్‌పై 12.2 ఓవర్లలోనే వంద కొట్టేసింది. రోహిత్‌ ఔటైన తర్వాత గిల్ వచ్చాడు. అతడితో కలిసి యశస్వి ‘సెంచరీ’ రికార్డును నమోదు చేశాడు.

Tags

Next Story