T20 World Cup: ఇక మన సెమీస్ సమరం..

టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. గురువారం బలమైన ఇంగ్లాండ్‌తో పటిష్ఠమైన భారత్ తలపడుతోంది. బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. కానీ ఫామ్, ఆటతీరు పరంగా చూసుకుంటే రోహిత్ సేనదే కాస్త పైచేయి. మన జట్టు వరుస విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ ఏమో తడబడుతూ వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రెండు జట్లకూ సరిపడా ప్రత్యామ్నాయాలున్నాయి. బ్యాటింగ్‌లోనూ లోతు ఎక్కువే. పైగా నాకౌట్ మ్యాచ్ కావడంతో హోరాహోరీ పోరు ఖాయమే.
ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా ఓడించి టీమ్‌ఇండియా.. తడబడుతూ ఇంగ్లాండ్ సెమీస్ చేరాయి. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచిన రోహిత్ సేన అజేయంగా కొనసాగుతోంది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాపై భారత్ నెగ్గింది. కెనడాతో మ్యాచ్ వర్షార్పణమైంది. సూపర్-8లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఇక స్కాట్లాండ్‌తో మ్యాచ్ రద్దు, ఆ తర్వాత ఆసీస్ చేతిలో ఓటమితో ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లాండ్.. ఒమన్, నమీబియాపై గెలిచి మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో స్కాట్లాండ్‌ను వెనక్కినెట్టి గ్రూప్ దశ దాటింది. సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. కానీ వెస్టిండీస్, అమెరికాపై విజయాలతో ముందంజ వేసింది.
ఇంగ్లండ్‌ను దెబ్బతీయడంలో బుమ్రా, కుల్దీప్‌యాదవ్ కీలకం కావచ్చు. తనదైన బౌలింగ్‌తో ఆదిలోనే ఇంగ్లిష్ టీమ్ బుమ్రా నడ్డివిరిస్తే..మిగతా పనిని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ కానిస్తాడు. వీరికి తోడు మంచి ఫామ్‌మీదున్న యువ పేసర్ అర్ష్‌దీప్‌సింగ్(15 వికెట్లు) మరోమారు చెలరేగితే బట్లర్ గ్యాంగ్‌కు ఇబ్బందులు తప్పవు. జడేజా, అక్షర్‌పటేల్ లెఫ్టార్మ్ స్పిన్ తంత్రం పనిచేస్తే..డిఫెండింగ్ చాంపియన్ పని పట్టొచ్చు.
ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీని ముద్దాడాలని చూస్తున్న ఇంగ్లండ్ సర్వశక్తులతో సమాయత్తమవుతున్నది. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచే ఇంగ్లిష్ టీమ్ మరోమారు అదే స్థాయిలో టీమ్‌ఇండియాకు చెక్ పెట్టాలని చూస్తున్నది.
భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లి, పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్, అక్షర్, జడేజా, కుల్‌దీప్, అర్ష్‌దీప్, బుమ్రా.
ఇంగ్లాండ్: బట్లర్ (కెప్టెన్, వికెట్‌కీపర్), సాల్ట్, బెయిర్‌స్టో, హ్యారీబ్రూక్, మొయిన్ అలీ, లివింగ్‌స్టన్, కరన్, జోర్డాన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, టాప్లీ/మార్క్‌వుడ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com