IND vs SA: భారత బ్యాటర్లపై సఫారీ బౌలర్ల సవారీ

సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు బ్యాటింగ్ లో తేలిపోవడంతో సఫారీలు ఈ టెస్టుపై పట్టు బిగించారు. తొలి ఇన్నింగ్స్ లో 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (13), ఐడెన్ మార్క్రామ్ (12) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటికే ఓటమికి చేరువైన టీమిండియా డ్రా చేసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. 9/0తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 201 పరుగులకే ఆలౌటైంది. సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ (6/48) విజృంభించాడు. 288 పరుగులు వెనుకబడిన భారత్‌ను ‘ఫాలోఆన్’ ఆడించడానికి అవకాశం ఉన్నా సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడటానికి మొగ్గుచూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 26/0 స్కోరుతో నిలిచింది. రికెల్‌టన్ (13*), మార్‌క్రమ్ (12*) క్రీజులో ఉన్నారు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో మార్‌క్రమ్‌కు లైఫ్ దొరికింది. సెకండ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ అతను ఇచ్చిన కాస్త కష్టతరమైన క్యాచ్‌ను అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టాప్-7 బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58; 97 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. ఒకదశలో 95/1తో మెరుగైన స్థితిలో కనిపించిన భారత్.. తర్వాత అనుహ్యంగా వికెట్లు చేజార్చుకుని 122/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15) విఫలమయ్యారు. ధ్రువ్ జురెల్ (0), రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఘోరంగా నిరాశపర్చారు. వాషింగ్టన్ సుందర్ కాస్త పోరాడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

