IPL Economy Crisis : భారత్-పాక్ వివాదంతో కుదేలైన ఐపీఎల్ మార్కెట్..రూ.6600 కోట్ల భారీ నష్టం.

IPL Economy Crisis : ఐపీఎల్ 2025 టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీ సొంతమైనప్పటికీ, ఐపీఎల్ మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఈ సీజన్ అంతగా కలిసి రాలేదు. గత ఏడాదితో పోలిస్తే, ఐపీఎల్ పూర్తి ఎకోసిస్టమ్ విలువలో భారీ క్షీణత కనిపించింది. ఈ పతనం సుమారు రూ.6600 కోట్లుగా అంచనా వేశారు. ఆశ్చర్యకరంగా, ఐపీఎల్ కప్ గెలుచుకున్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ కూడా 10% తగ్గింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక కప్‌లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ విలువలో ఏకంగా 24% భారీ క్షీణత నమోదైంది. అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఉన్న ముంబై ఇండియన్స్ కూడా నష్టాన్ని చవిచూసింది. కేవలం గుజరాత్ టైటాన్స్ మాత్రమే బ్రాండ్ వాల్యూ పెరిగిన ఏకైక ఫ్రాంచైజీగా నిలిచింది.
బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొత్తం బ్రాండ్ వాల్యూ గత ఏడాది $12 బిలియన్ల నుంచి ఈ ఏడాది 20% తగ్గి $9.6 బిలియన్లకు చేరుకుంది. ఈ భారీ క్షీణతకు ప్రధాన కారణాలుగా ఈ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, మెగా-వేలం గురించిన అనిశ్చితులుగా చెబుతున్నారు. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భద్రతా కారణాల వల్ల ప్లేఆఫ్‌లతో సహా అన్ని మ్యాచ్‌లను ఒక వారం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. కోవిడ్ మహమ్మారి ప్రభావితమైన 2020 సీజన్ మినహా, బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఐపీఎల్ ఎకోసిస్టమ్ విలువ తగ్గిన ఏకైక సంవత్సరం ఇదే.
ఒకప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందిన ఐపీఎల్, ఇప్పుడు మీడియా ఏకీకరణ, రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌లపై ప్రభుత్వ నిషేధం కారణంగా వృద్ధి మందగించింది. ఐపీఎల్ వాల్యుయేషన్ రూ.82,700 కోట్ల ($9.9 బిలియన్లు) నుంచి రూ.76,100 కోట్ల ($8.8 బిలియన్లు)కి పడిపోయింది.
ముంబై ఇండియన్స్ $108 మిలియన్లతో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, వారి బ్రాండ్ వాల్యూలో 9% క్షీణత కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో తమ మొదటి టైటిల్‌ను గెలుచుకున్నప్పటికీ, వారి బ్రాండ్ వాల్యూ 10% తగ్గి $105 మిలియన్లతో రెండవ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ 24% భారీ క్షీణతతో $93 మిలియన్లకు పడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 33% తగ్గి $73 మిలియన్లకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్రాండ్ వాల్యూ పెరిగిన ఏకైక ఫ్రాంచైజీ ఇదే. జీటీ విలువ 2% పెరిగి $70 మిలియన్లకు చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వాల్యుయేషన్ 34% తగ్గి $56 మిలియన్లకు, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 35% క్షీణతతో $53 మిలియన్లకు చేరుకున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

