IPL: విదేశీ ఆటగాళ్లపై తగ్గిన మోజు

ఐపీఎల్ మెగా వేలంలో విదేశీ ఆటగాళ్లపై మోజు తగ్గింది. ఐపీఎల్ వేలం ఎప్పుడు జరిగినా ఫ్రాంచైజీలన్నీ ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై దృష్టి పెడుతుంటాయి. ఈసారి అది జరగలేదు. ప్రాంచైజీలు భారత ఆటగాళ్లపైనే మక్కువ చూపాయి. పంత్ రూ.27 కోట్లు.. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు అమ్ముడుపోయారు. దీంతో గతేడాది ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) అత్యధిక ధరతో రికార్డు బద్దలై పోయింది. ఈ సారి స్టార్క్‌ను ఢిల్లీ రూ.11.75 కోట్లకే దక్కించుకుంది.
అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కు రూ. 6 కోట్లు
ఐపీఎల్ మెగా వేలంలో అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లలో రసిక్ దార్ సలామ్‌కు అత్యధిక ధర పలికింది. రూ.30 లక్షల కనీస ధర కలిగిన అతడిని బెంగళూరు రూ.6 కోట్లకు తీసుకుంది. అయితే రసిక్‌ను ఆర్‌సీబీ రూ.2 కోట్లకే తీసుకోగా, ఢిల్లీ జట్టు ఆర్‌టీఎంను ఉపయోగించింది. దీంతో ఆర్‌సీబీ ఒక్కసారిగా రేటును రూ.6 కోట్లకు పెంచి సొంతం చేసుకుంది. నమన్ ధిర్‌ను కూడా ముంబై ఇండియన్స్ ఆర్‌టీఎం ద్వారా రూ.5.25 కోట్లకు తీసుకుంది. అబ్దుల్ సమద్ (లఖ్‌నవూ), నేహల్ వధేరా (పంజాబ్) రూ.4.20 కోట్ల చొప్పున, అభినవ్ మనోహర్ (సన్‌రైజర్స్) రూ.3.20 కోట్లు, రఘువంశీ (కోల్‌కతా) రూ.3 కోట్లకు అమ్ముడయ్యారు. గత మినీ వేలంలో రూ.8.40 కోట్ల ధర పలికిన సమీర్ రిజ్వీని ఈసారి రూ.95 లక్షలకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
వీరికి నిరాశే..
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఎవరూ ఆసక్తి చూపలేదు. రూ.2 కోట్ల కనీసధర కలిగిన దేవ్‌దత్ పడిక్కళ్, బెయిర్‌స్టోకు సైతం నిరాశే ఎదురైంది. అలాగే అన్‌క్యాప్డ్ ప్లేయర్ యష్ ధుల్, అన్‌మోల్‌ప్రీత్, సీనియర్ పీయూష్ చావ్లా కూడా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు.
మరోసారి కావ్య పాప వైరల్
ఇండియా ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో అందరి దృష్టిని మరోసారి ఆకర్షించింది సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్. ఐపీఎల్ వేలం ఎప్పుడు వచ్చినా ఆటగాళ్ల పేరు ఎంతలా వినపడుతుందో.. కావ్య మారన్ పేరు అంతే వినిపిస్తుంది. ఈసారి కూడా మెగా వేలంలోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యూహాత్మకంగా బిడ్డింగ్ వేస్తూ కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. కావ్య మారన్ కోసం చాలా మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com