AP: గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ..?

AP: గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ..?
ఆందోళనలతో హోరెత్తించిన జనసేన-టీడీపీ... రహదారులు నరకానికి నకలుగా మారాయని ఆవేదన

గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమంలో భాగంగా రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం- జనసేన శ్రేణులు ఆందోళనలతో హోరెత్తించాయి. వైసీపీ పాలనలో రహదారులు నరకానికి నకలుగా మారాయని నేతలు విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఒక్క రహదారినైనా నిర్మించకపోగా పాడైన రోడ్లకు కనీస మరమ్మతులూ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరూవాడా నిరసన ర్యాలీలు చేపట్టిన తెలుగుదేశం-జనసేన నేతలు జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ప్రజాసమస్యలపై ఉమ్మడిపోరులో భాగంగా రహదారుల దుస్థితిపై ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో తెలుగుదేశం-జనసేన శ్రేణులు రెండోరోజూ నిరసనలతో హోరెత్తించాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో గుంతలరోడ్లపై బైఠాయించారు. రోడ్లదుస్థితిపై వాహనదారులతో మాట్లాడి సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి అక్రమ లేఔట్లకు రోడ్లు నిర్మించడంపై ఉన్న శ్రద్ధ రోడ్ల నిర్మాణంపై లేదని ఆరోపించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పాములపల్లి రోడ్డుపై తెలుగుదేశం-జనసేన నేతలు ర్యాలీ చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లపై తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవని విమర్శించారు. పల్నాడు జిల్లా తంగడ గ్రామంలోని గుంతల రోడ్లపై ఇరుపార్టీల నేతలు ఆందోళన చేశారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోందని నేతలు మండిపడ్డారు.


జగన్‌ పాలనలో రోడ్ల దుస్థితిని వివరిస్తూ కృష్ణా జిల్లా మంటాడ వద్ద తెలుగుదేశం-జనసేన నేతలు ఆందోళనకు దిగారు. గుంతలో చిక్కుకున్న ఆటో చుట్టూ వైసీపీ రంగులు వేసి జగన్‌ గారి గుంత-సామాన్యులకు తప్పని తంటా అంటూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఫ్యాన్‌ వేసుకుని కూర్చుంటే సామాన్యులు మాత్రం గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు ప్రధాన రహదారిపై తెలుగుదేశం-జనసేన నేతలు నిరసన తెలిపారు. రోడ్ల మరమ్మతులపై వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.


జగన్ రెడ్డి ఇప్పటికైనా బటన్లు నొక్కడం మాని రోడ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అధ్వానంగా మారిన రహదారుల గురించి ఎన్ని పోరాటాలు చేసినా జగన్‌ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని తెలుగుదేశం-జనసేన నాయకులు విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొన్నిచోట్ల శ్రమదానం చేసిన తెలుగుదేశం -జనసేన శ్రేణులు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story