JEMIMAH: జయహో జెమీమా..!

JEMIMAH: జయహో జెమీమా..!
X
కెరీర్‌లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా

అసలే సెమీఫైనల్.. అందులోనూ కంగారులు.. ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచులోనూ ఓటమి ఎరుగుని జట్టు అది. అందులోనూ టీమిండియా బౌలర్లను చితక్కొట్టి భారీ స్కోరు చేశారు. ఇంతవరకూ అంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టే లేదు. ఇంకేముంది? భారత జట్టు ఓటమి ఖాయం అయిపోయిందనుకున్నారంతా. కానీ, కళ్లముందు అద్భుతమే జరిగింది.. 339 పరుగుల కొండంత లక్ష్యం భారత నారీమణుల ఆత్మవిశ్వాసం, అసమాన పోరాటం ముందు చిన్నబోయింది. ఒక పొట్టమ్మాయి పోరాటానికి లొంగిపోయింది. ఓడిపోవడానికి అసలే ఇష్టపడని ఒక పట్టుదలకు సలాం చేసింది. ఆ పట్టుదల పేరు జెమీమా రోడ్రిగ్స్​. ఒక దశలో జట్టులో స్థానమే అనుమానంగా ఉన్న స్థాయి నుండి మొండి పట్టుదలతో జట్టును ఫైనల్​కు చేర్చిన ప్రయాణం. 339 పరుగులు మంచులా కరిగి, పరుగులెత్తి అలసిన ఆ అమ్మాయి కాళ్లు కడిగాయి.

అసాధారణ ఇన్నింగ్స్

ఏడేళ్ల వన్డే కెరీర్‌... తొలి వన్డే ప్రపంచ కప్‌... టోర్నీకి ముందు చక్కటి ఫామ్‌... కెరీర్‌లో రెండు సెంచరీలు ఈ ఏడాదే వచ్చాయి... అయితే వరల్డ్‌ కప్‌లో వరుస వైఫల్యాలు... తొలి 3 మ్యాచ్‌లలో 2 డకౌట్లు... మీడియాతో మాట్లాడినంత సేపు కూడా క్రీజ్‌లో నిలవడం లేదని వ్యాఖ్యలు... ఆటకంటే పాటలు, డ్యాన్స్‌లపైనే దృష్టి అనే విమర్శలు... ఒక మ్యాచ్‌లో ఆడించకుండా పక్కన పెట్టేశారు కూడా... కానీ జెమీమా రోడ్రిగ్స్‌ తన జీవితంలో అత్యంత విలువైన ఆటను అసలు వేదికపై ఆడింది.తీవ్ర ఒత్తిడి ఉండే నాకౌట్‌ మ్యాచ్‌లో రెండో ఓవర్లోనే క్రీజ్‌లోకి... గతంలో కీలక సమయాల్లో మ్యాచ్‌ను కోల్పోయిన గుర్తులు... కానీ ఆమె ‘జెమ్‌’లాంటి ప్రదర్శనతో తన విలువను చూపించింది. శతకాన్ని దాటి అలసటతో బాధపడుతున్నా చివరి వరకు పోరాడింది.. మరచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో చరిత్రలో తన పేరు లిఖించుకుంది.

ఆ దేవుడి దయ వల్లే...

"జీసస్‌కు నా కృతజ్ఞతలు. ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు దేవుడే నా తరఫున పోరాడతాడనే బైబిల్‌లోని ఒక వాక్యాన్ని మ్యాచ్‌ చివరి క్షణాల్లో మళ్లీ మళ్లీ చదువుకున్నాను. నా సొంతంగా నేను ఏమీ చేయలేదు కాబట్టి గెలిపించాననే మాట చెప్పను. ఈ టోర్నీ ఆసాంతం మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. దాదాపు ప్రతీరోజు ఏడ్చాను. కానీ దేవుడే అంతా చూసుకున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాననే విషయం మ్యాచ్‌కు ముందు తెలీదు. నాసెంచరీకి ప్రాధాన్యత లేదు. జట్టు గెలవడమే ముఖ్యం. నేను క్రీజ్‌లో ఇబ్బంది పడుతుండగా సహచరులు అండగా నిలిచారు. అభిమానుల ప్రోత్సాహం బాధను దూరం చేసింది. అందుకే విజయం సాధించగానే భావోద్వేగాలను నియంత్రించుకోలేక బాగా ఏడ్చేశాను.” అని జెమీమా మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.

Tags

Next Story