KHO-KHO: ఖో ఖో విశ్వవిజేతలుగా భారత్

ఖోఖోలో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. సొంతగడ్డపై జరిగిన ఇనాగ్యురల్ ప్రపంచకప్‌లో అపజయం లేకుండా భారత జట్లు టైటిల్ సాధించాయి. ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 78-40 తో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి వరుసగా పాయింట్లు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఏ దశలోనూ కోలుకునే అవకాశమివ్వలేదు. ముఖ్యంగా కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. సారథిగా జట్టును ముందుండి నడిపింది. వైష్ణవీ పవార్, సంజన బి, ప్రియాంక , చైత్ర.. భారత్ తరపున పాయింట్లు సాధించి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు.
పురుషుల జట్టు కూడా
ఇక..పురుషుల జట్టు 54-36 పాయింట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి చాంపియన్‌షి్‌ప దక్కించుకుంది. తొలుత జరిగిన అమ్మాయిల ఫైనల్లో మనోళ్లు అన్ని రంగాలలో తిరుగులేని ప్రదర్శన కనబరచారు. అనూహ్యమైన వేగంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశారు. భారత్ ధాటికి నేపాల్ చేష్టలుడిగింది. మొదటి టర్న్ ఆరంభంనుంచే భారత అటాకర్లు విజృంభించారు. నేపాల్‌తో తుది పోరులో పురుషుల జట్టు కూడా అన్ని రంగాలలో కదం తొక్కింది. దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో తేలిపోయిన డిఫెన్స్ విభాగం..నేపాల్‌పై చెలరేగింది. తొలి టర్న్.. అటాకింగ్‌లో 26 పాయింట్లను భారత్ సాధించింది. రెండో టర్న్‌లో నేపాల్ 18 పాయింట్లు రాబట్టింది. దాంతో రెండు టర్న్‌లు ముగిసే సరికి భారత్ 26-18తో ముందంజలో నిలిచింది. మూడో టర్న్..అటాకింగ్‌లో భారత పురుషులు మరింత దూకుడుతో ఇంకో 28 పాయింట్లు సొంతం చేసుకున్నారు. ఇక..చివరి టర్న్‌లో నేపాల్ 18 పాయింట్లే చేయడంతో భారత్ విజయం ఖాయమైంది.
జట్లకు శుభాకాంక్షల వెల్లువ
ఖో ఖో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళ, పురుషుల జట్లను ఆకాశానికి ఎత్తేస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చరిత్రాత్మక విజయంతో భారత్‌లో ఖో ఖోకు ప్రాధాన్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశంలోని పురాతన సాంప్రదాయ క్రీడలలో ఒకటైన ఖో ఖోకు మరింత వెలుగులోకి తీసుకొస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు క్రీడా ప్రేమికులు. ప్రధాని కూడా ఖో ఖో జట్లకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
ఖోఖో WC విజయంలో తెలుగోడి పాత్ర
భారత మహిళల జట్టు ఖోఖో వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలో తెలుగోడి పాత్ర ఉండడం విశేషం. అతడే ఇస్లావత్ నరేశ్. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని బంజరపల్లికి చెందిన నరేశ్ భారత మహిళల జట్టుకు సహాయ కోచ్‌గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 2015లో కోచ్‌గా మారారు. ఆ తర్వాత జాతీయ జట్టుకు సహాయ కోచ్‌గా ఎదిగారు. ఆటగాళ్ల తప్పులు, బలహీనతలను సరిచేయడంలో స్కిల్ అనలైజర్‌గా ముఖ్య పాత్ర పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com