ICC T20 All-Rounder Rankings : టీ20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్.. లివింగ్ స్టోన్ టాప్

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లియామ్ లివింగ్ స్టోన్ ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్‌స్టోన్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్ 211 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటర్‌గా 37 రన్స్ చేయడంతో పాటు.. 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. కేవలం 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్ టెన్ లో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉన్నాడు. పాండ్యా 7వ స్థానంలో నిలిచాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com