Manu Bhaker: స్వదేశానికి మను బాకర్, ఢిల్లీలో ఘన స్వాగతం

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు సాధించిన భారత్ యువ షూటర్ మను బాకర్ స్వదేశం చేరుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయం వద్ద డప్పుల మోతతో ఘన స్వాగతం పలికారు. భారత ఫాన్స్ పెద్ద ఎత్తున ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం మను బాకర్ కారులో ర్యాలీగా బయలుదేరారు. తన మెడల్‌ను అభిమానులకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మను వెంట కోచ్ జస్పాల్ రాణా ఉన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని సాధించి.. భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పతకంను స్వల్ప తేడాతో కోల్పోయారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మను బాకర్ మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. శనివారం బయల్దేరి పారిస్ చేరుకోనున్నారు. భారత పతాకధారుల్లో మను ఒకరు. ఆదివారం జరిగే ముగింపు వేడుకలకు హాజరుకానునరు. ఈరోజు మధ్యాహ్నం క్రీడల మంత్రిని కలవనున్నారు. భారత ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com