CRICKET: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

CRICKET: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌
X
24 ఏళ్ల తర్వాత స్వదేశంలో భారత్ క్లీన్ స్వీప్.. తప్పందా నాదే అన్న రోహిత్ శర్మ

సొంతగడ్డపై జైత్రయాత్ర సాగించిన టీమిండియాను న్యూజిలాండ్‌ చావుదెబ్బ తీసింది. శ్రీలంకపై రెండు టెస్టుల సిరీస్‌ను కోల్పోయి ఇక్కడి వచ్చిన కివీస్‌.. ఒక్క టెస్టులో గెలిస్తే గొప్పే అనుకున్నారు. కానీ అనూహ్య ఆటతీరుతో ఏకంగా సిరీస్‌నే 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి భారత జట్టు బిగ్ షాక్ ఇచ్చింది. చివరిదైన మూడో టెస్టులోనూ స్పిన్‌ను ఆడలేక బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్‌ సేన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఫలితంగా రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో పర్యాటక కివీస్‌ 25 పరుగుల తేడాతో గెలిచింది. వాస్తవానికి భారత జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ కావడం కూడా 24 ఏళ్లలో ఇదే తొలిసారి. స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ (6/57), ఫిలిప్స్‌ (3/42) ఇబ్బందిపెట్టడంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. పంత్‌ (64) మాత్రమే రాణించాడు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు సాధించింది. జడేజాకు ఐదు, అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి.

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

టీమిండియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ వైట్ వాష్ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత గడ్డపై టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్ ముందు వ‌ర‌కు స్వ‌దేశంలో టీమిండియా ఏ జట్టు చేతిలో కూడా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌ వాష్‌కు గురవ్వలేదు. 2000లో సౌతాఫ్రికా చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ వైట్‌ వాష్‌కు గురైంది.

ఓట‌మి బాధిస్తోంది: రోహిత్ శర్మ

ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ (WTC 2023-25) ఫైన‌ల్ ఆశ‌లకు గండికొడుతూ న్యూజిలాండ్ 3-0తో సిరీస్‌ గెలుచుకుంది. వాంఖ‌డేలో దారుణ ఓట‌మిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. ‘‘సిరీస్ కోల్పోవ‌డం చాలా బాధ‌గా ఉంది. స్వ‌దేశంలో టెస్టు సిరీస్ కోల్పోవ‌డం జీర్ణించుకోలేని విష‌యం. మేము అత్యుత్త‌మ ఆట ఆడ‌లేదు. సిరీస్ మొత్తం కివీస్ చాలా గొప్ప‌గా ఆడింది’’ అని తెలిపారు. భారత్ డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానం చేజార్చుకుంది.

క‌పిల్ రికార్డు బ‌ద్ధ‌లు కొట్టిన రవీంద్ర జడేజా

వాంఖ‌డేలో న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించిన జ‌డేజా 24 గంటల్లోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో మ‌రో రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌పై రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీసిన జ‌డేజా టెస్టుల్లో 15వ సారి ఈ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. తద్వారా టీమిండియా త‌ర‌ఫున‌ టెస్టుల్లో నాలుగోసారి 10 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. త‌ద్వారా భార‌త దిగ్గ‌జం క‌పిల్ దేవ్ రికార్డును జ‌డ్డూ బ‌ద్ధ‌లు కొట్టాడు.

ఆ నలుగురు క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లేనా..?

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా ఘోర పరాజయంతో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ తర్వాత రోహిత్‌, కోహ్లీ, రవీంద్ర జడేజా, అశ్విన్‌లను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్‌పై బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్‌, కెప్టెన్ రోహిత్ శర్మ అనధికార చర్చలు జరపనున్నారు.

Tags

Next Story