IND vs NZ : న్యూజిలాండ్ లక్ష్యం 107.. ఐదో రోజు ఆటపై ఉత్కంఠ

IND vs NZ : న్యూజిలాండ్ లక్ష్యం 107.. ఐదో రోజు ఆటపై ఉత్కంఠ
X

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే కివీస్‌కు107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం న్యూజిలాండ్‌ టార్గెట్‌ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. తొలి ఓవర్‌లో నాలుగు బంతులు పడిన తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి భారీ వర్షం కురవడం మొదలైంది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌ల్లోకి చేరగా.. మైదాన సిబ్బంది గ్రౌండ్‌ని కవర్లతో కప్పి ఉంచారు. కాసేపటికే నాలుగో రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పరుగులేమీ చేయలేదు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌ (150, 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకం బాదగా.. రిషభ్ పంత్ (99, 105 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ(70), రోహిత్‌ (52), జైశ్వాల్‌ (32) పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా (5), అశ్విన్ (15) నిరాశపర్చారు. ఒకదశలో 400/3తో బలమైన స్థితిలో నిలిచిన టీమిండియా.. కివీస్‌ బౌలర్లు కొత్త బంతిని అందుకున్న తర్వాత వేగంగా వికెట్లు కోల్పోయింది. కొత్త బంతితో భారత్ 62 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, విలియం 3, అజాజ్ పటేల్ 2, టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్‌ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 402 పరుగులు చేసింది.

Tags

Next Story