T20 WORLDCUP: తొలి మ్యాచ్‌లో భారత్‌ తడ "బ్యాటు"

T20 WORLDCUP: తొలి మ్యాచ్‌లో భారత్‌ తడ బ్యాటు
X
టీమిండియాపై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. బ్యాటర్ల సమష్టి వైఫల్యం

భారీ అంచనాలతో.. ఎన్నో అంచనాలతో మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన భార‌త మహిళల జట్టుకు ఊహించ‌ని షాక్‌ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచులో బ్యాట‌ర్ల స‌మిష్ఠి వైఫ‌ల్యంతో టీమిండియా భారీ ఓటమిని మూట‌గ‌ట్టుకుంది. ఎన్నో ఆశ‌ల‌తో ప్రపంచ కప్ వేటను ప్రారంభించిన హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి న్యూజిలాండ్ బిగ్ షాకిచ్చింది. ఏకంగా 58 ప‌రుగుల తేడాతో భారత్ పరాజయాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఈ మ్యాచుతో కివీస్ 2 పాయింట్లతో పాటు మంచి ర‌న్‌రేటును సాధించింది. రెండు నెలల పాటు అంతర్జాతీయ మ్యాచులకు దూరంగా ఉన్న టీమిండియా కేవలం 10 రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌లో సాధన చేసి యూఏఈ వెళ్లింది. తొలుత రెండు వార్మప్ మ్యాచుల్లో రాణించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. దీంతో భారత సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

రాణించిన న్యూజిలాండ్ బ్యాటర్లు

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (36 బంతుల్లో 57 నాటౌట్‌, 7 ఫోర్లు) ధనాధన్‌ ఆటతో విరుచుకుపడగా ఓపెనర్‌ ప్లిమ్మర్‌ (23 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌ (2/27) రాణించింది. లక్ష్య ఛేదనలో భారత్‌ 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ తరఫున ఒక్క బ్యాటర్‌ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (15) టాప్‌ స్కోరర్‌. కివీస్‌ పేసర్‌ రొస్‌మెరీ మెయిర్‌ (4/19), లీ తహుహు (3/15), ఈడెన్‌ కార్సన్‌ (2/34) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. డివైన్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

భారత బ్యాటర్లు తడబ్యాటు

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే నిరాశ పర్చింది. ఓవర్‌కు ఎనిమిది పరుగులకు పైగా ర‌న్‌రేటు కావాల్సి ఉండగా.. భారత ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ (2)ను ఈడెన్ కార్సన్ ఔట్ చేసింది. 11 ప‌రుగుల‌కే తొలి వికెట్ ప‌డగా.. మ‌రో ఓపెన‌ర్ స్మృతి మంధాన‌ (12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15)లు ఆచితూచి ఆడటం ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపటికే మంధాన ఔట్ అవ్వడంతో ర‌న్‌రేటు అమాంతం పెరిగిపోయింది. దీంతో ఒత్తిడికి లోనై భారీ షాట్లకు యత్నించిన కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. దీంతో టీమిండియా గెలుపు భారం మిడిలార్డర్‌పై పడింది. చూస్తుండగానే జెమీమా రోడ్రిగ్స్(13), రీచా ఘోష్‌ (12), అరుంధ‌తి రెడ్డి(1)లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో భార‌త్ ఓట‌మి దాదాపుగా ఖాయ‌మైంది. టెయిలెండర్లు కూడా చేతులెత్తేయడంతో కివీస్ 58 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, భారత టాపార్డర్, మిడిలార్డర్‌ను కూల్చడంలో న్యూజిలాండ్ బౌల‌ర్ రొస్‌మెరీ మెయిర్(4/19) సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

Tags

Next Story