PAK: భారత్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాక్

ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఆటను క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మరిచిపోలేరు. ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత బౌలర్ల సత్తాను శంకించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవల్ మైదానంలో బాల్ ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు.
ఏమన్నాడంటే...?
భారత జట్టు విజయాన్ని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షబ్బీర్ అహ్మద్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు భారత్ పై ఉన్న అక్కసును మరోసారి వెళ్లగక్కాడు. టీమ్ఇండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించాడు. భారత బౌలర్లు బంతికి పెట్రోలియం జెల్లీని రాసి ఉంటారని ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఉపయోగించిన డ్యూక్ బంతిని ల్యాబ్‌లో పరీక్షించాలని ఆయన డిమాండ్ చేశాడు. “భారత బౌలర్లు బంతికి వ్యాజిలైన్ పూసిందని భావిస్తున్నాను. ఎందుకంటే 80 ఓవర్లు దాటిన తరువాత కూడా బంతి మెరుపు కోల్పోలేదు. అంపైర్ ఆ బంతిని ల్యాబ్ టెస్ట్‌కు పంపాలి.” అని తన సోషల్ మీడియా ఖాతాలో షబ్బీర్ రాసుకొచ్చాడు. అతడి ట్వీట్ వైరల్‌గా కాగా.. నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. భారత జట్టు విజయాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శల వర్షం కురిసింది. భారత అభిమానులైతే షబ్బీర్ అహ్మద్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
నువ్వు కూడా చెప్తావా...?
1999 నుంచి 2007 వరకు షబ్బీర్ అహ్మద్ పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పాక్ తరుపున అతడు 10 టెస్టులు, 32 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 84 వికెట్లు తీశాడు. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతడి పై ఓ ఏడాది నిషేదం కూడా విధించారు. బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఏడాది పాటు నిషేదాన్ని ఎదుర్కొన్న మొదటి ఆటగాడు అతడే కావడం గమనార్హం. బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇలా 12 నెలలపాటు నిషేధం ఎదుర్కొన్న తొలి క్రికెటర్ అతడే కావడం గమనార్హం. ఈ విషయమై కూడా నెటిజన్లు అతన్ని దుయ్యబడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధానికి గురైన వారు సైతం ఇప్పుడు నిపుణుల్లా వ్యవహరిస్తున్నారంటూ చురకలంటిస్తున్నారు.
గిల్‌పై మాజీ క్రికెటర్ ప్రశంసలు
బ్యాటర్‌గా, నాయకుడిగా అద్వితీయ ప్రతిభ కనబరిచిన గిల్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ప్రదర్శన నమ్మశక్యంగా లేదని, అతను జట్టును పూర్తిగా తన భుజాలపై మోశాడని కనేరియా కొనియాడాడు. గిల్ అద్భుత బ్యాటింగ్‌తో పాటు, అతని నాయకత్వ పటిమ కూడా సిరీస్‌కు కీలకంగా నిలిచింది. కఠినమైన ఇంగ్లండ్ పరిస్థితుల్లో ప్రశాంతంగా, అదే సమయంలో దృఢంగా జట్టును నడిపించాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్లు అందించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ 427/6 వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం గిల్ వ్యూహాత్మక నాయకత్వానికి నిదర్శనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com