ICC Champions Trophy : దిగొచ్చిన పాక్..ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి హైబ్రిడ్ మోడల్

2025లో జరగనున్న ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగనున్నట్టు తెలుస్తోంది. మొదట అ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకుంది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే టీమ్ఇండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. టోర్నీలో భారత్ ఆడకపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన పాక్ క్రికెట్ బోర్డు.. కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం టీమ్‌ఇండియా పర్యటనకు అనుమతించకపోతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీసీబీ తెలిపింది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పీసీబీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించింది. దాని ప్రకారం టోర్నీ ఫిబ్రవరి 19, 2025న ప్రారంభం కావాల్సి ఉంది. మార్చి 1న లాహోర్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్, మార్చి 9న లాహోర్‌లోనే ఫైనల్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. టోర్నీని హైబ్రిడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఐసీసీ ముందుగానే అప్రమత్తమైంది. భారత జట్టు మ్యాచ్‌లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే అందుకు అవసరమైన నిధులను టోర్నీ బడ్జెట్‌లో కేటాయించింది. 2023 ఆసియా కప్ పాకిస్థాన్ వేదికగానే జరగ్గా.. హైబ్రిడ్ విధానం అనుసరించి భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com