Virat Kohli : కోహ్లీ భయం వద్దు.. అటాక్ చెయ్ : రవిశాస్త్రి

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటుకు గురైన కోహ్లీకి మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. అయినా, కోహ్లీ విషయంలో ఆందోళన అవసరం లేదని, భయపడక్కర్లేదని రవిశాస్త్రి అన్నారు. ఇంకాస్త దూకుడుగా ఆడితేనే ఈ సమస్య సగం పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ‘గత రెండు లేదా మూడేళ్ల నుంచి విరాట్ కోహ్లీ ఎక్కువగా ఆఫ్ స్పిన్నర్లకు వికెట్ ఇచ్చేస్తున్నాడు. అయితే, భారీగా పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. అతడు తన పాదాలను మరింత ఎక్కువగా వినియోగించాలి. పిచ్‌పై బంతి పడినప్పుడు స్వీప్ చేసేందుకు ప్రయత్నించాలి. సమయానికి తగ్గట్టుగా మారుతూ ఉండాలి. అంతేకానీ, ఎక్కడా భయపడొద్దు. ఆఫ్ స్పిన్నర్లపై ముందే ఎదురుదాడి చేయాలి. అప్పుడే వారి బౌలింగ్ గతి తప్పేందుకు ఎక్కువ వీలుంటుంది. గతంలో భారీగా పరుగులు చేసినప్పుడు అతడి ఆటతీరు ఇలానే ఉండేది. భారత్ వేదికగా ఉండే ట్రాక్‌లపై ఆడటం అంత సులువేం కాదు. చెపాక్‌లో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో ఔటైన తీరు చూస్తే ఫన్నీగా అనిపించింది. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అలాంటి బంతులపై కోహ్లీకి అవగాహన ఉంది. మున్ముందు మరోసారి స్పిన్నర్‌కు వికెట్ ఇచ్చే విషయంలో విరాట్ పరిష్కారం కోసం అన్వేషించాలి. ఏం చేస్తే దాని నుంచి బయటపడతామనే దానిపై తీవ్రంగా సాధన చేయాలి’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com