Ravichandran Ashwin : కుర్చీలాట వల్లే పాక్ పతనం : రవిచంద్రన్ అశ్విన్

ప్రస్తుతం పాక్ జట్టులో నెలకొన్న పరిస్థితపై భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గొప్ప క్రికెటర్లు ఆడిన పాక్ జట్టు పరిస్థితిని చూస్తుంటే విచారంగా ఉందని తెలిపాడు. వరుసగా కెప్టెన్లను మార్చడం వల్లే పాక్ టీమ్‌లో అయోమయం నెలకొందని చెప్పారడు. ‘పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే చాలా బాధేస్తోంది. నిజాయతీగా చెప్పాలంటే అత్యంత దారుణంగా ఉంది. పాక్ తరఫున ఎంతో మంది అద్భుత ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించారు. జట్టు కూడా గొప్ప విజయాలను నమోదు చేసింది. కానీ, బోర్డులో చోటు చేసుకుంటున్న ఘటనలతో జట్టు పతనావస్థకు చేరింది. కుర్చీలాటతో పాక్ పరిస్థితి మరింత దిగజారుతోంది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో ఓటమిపాలైన తర్వాత బాబర్ అజామ్ రాజీనామా చేశాడు. అప్పుడు టీ20 జట్టుకు షహీన్‌ను తీసుకొచ్చారు. కొద్ది రోజుల్లోనే అతడి స్థానంలో మళ్లీ బాబర్‌ను నియమించారు. షాన్ మసూద్‌ను టెస్టు సారథిగా పెట్టారు. ఆ తర్వాత కూడా పాక్ తన సొంత గడ్డపై టెస్టు విజయం సాధించలేదు. దాదాపు 1000 రోజులుగా గెలవలేదంటే సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. అంతే కానీ ఏ క్రికెటర్ కూడా జట్టు కంటే వ్యక్తిగతానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు’ అని అశ్విన్ తెలిపాడు. ఇకనైనా ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టిసారించి జట్టు విజయాలకు సహకరించాలని సూచించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com