IND vs AFG: రో"హిట్‌" శతకంతో అఫ్గాన్‌ చిత్తు

IND vs AFG:  రోహిట్‌ శతకంతో అఫ్గాన్‌ చిత్తు
అఫ్గానిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం

స్వదేశంలో జరుగున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌పై సునాయాస విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి భారత్‌ చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 274 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆఫ్గానిస్తాన్‌ బ్యాటింగ్‌ తీసుకుంది. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్‌ (21: 28 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్‌ (22) నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 32 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో జద్రాన్‌ను బుమ్రా ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రెహ్మత్‌ (16) శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. 63 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ ఆఫ్గానిస్తాన్‌ను షాహిది (80: 88 బంతుల్లో), ఒమర్‌జాయ్‌ (62: 69 బంతుల్లో) ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 128 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఒమర్‌ జాయ్‌ 62, షాహిది 58 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు అందుకున్నారు. దీంతో అఫ్గాన్‌ స్కోర్‌ 272/8కి చేరింది.


273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (131: 84 బంతుల్లో, 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (47: 47 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అఫ్గాన్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగడంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్ సెంచరీ పూర్తయింది. వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఇదే వేగవంతమైన శతకం. మొదటి వికెట్‌కు 156 పరుగులు జోడించిన అనంతరం ఈ జోడిని రషీద్ ఖాన్ విడదీశాడు. ఇషాన్ కిషన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కవర్స్‌లో ఉన్న ఇబ్రహీం జద్రాన్ చేతిలో పడింది. దీంతో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించిన అనంతరం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో (25 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి విరాట్ మ్యాచ్‌ను ముగించాడు.

Tags

Read MoreRead Less
Next Story