IND VS ENG: రెండో వన్డేలో రో "హిట్"

హిట్‌మ్యాన్ చెలరేగిపోయాడు. విమర్శకుల నోళ్లకు బ్యాటుతో తాళం వేసేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అద్భుత శతకంతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. హిట్ మ్యాన్ సూపర్ సెంచరీకి తోడు గిల్ సమయోచిత అర్ధ శతకంతో భారీ లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించిన టీమిండియా... మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 305 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (119) సెంచరీతో రాణించగా.. గిల్ 60, శ్రేయాస్ 44, అక్షర్ పటేల్ 41* పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ బ్యాటర్లు జోరు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు ఈసారి రాణించారు. టాప్ ఆర్డర్ అంతా సమష్టిగా రాణించడంతో బ్రిటీష్ జట్టు 300 దాటగలిగింది. ఓపెనర్లు డకెట్, సాల్ట్ (26) తొలి పవర్‌ప్లేలో వేగంగా ఆడడంతో 75 పరుగులు వచ్చాయి. హాఫ్ సెంచరీతో ఊపు మీదున్న డకెట్‌ను జడేజా తన తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. రూట్, బ్రూక్ జోడీ భారత్‌ను విసిగిస్తూ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించింది. బ్రూక్ వెనుదిరిగాక రూట్‌కు బట్లర్ జత కలిశాడు. రూట్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఆ జట్టు 304 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో డకెట్ (65), రూట్ (69) హాఫ్ సెంచరీలు చేయగా.. బ్రూక్ (31), బట్లర్ (34), లివింగ్‌స్టన్ (41) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
రో "హిట్"
భారీ ఛేదనలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్, గిల్ ఇంగ్లండ్ బౌలర్లను యధేచ్ఛగా ఆడేసుకున్నారు. రోహిత్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు గిల్ సంయమనంతో ఆడాడు. ఏడో ఓవర్‌లో ఓ ఫ్లడ్‌లైట్ మొరాయించడంతో అరగంట పాటు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మొదలైన తర్వాత కూడా రోహిత్ జోరు తగ్గలేదు. వరుస బౌండరీలతో 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. గిల్ కూడా 45 బంతుల్లో ఈ ఫిఫ్టీ సాధించాడు. కానీ ఒవర్టన్ అతడిని సూపర్ యార్కర్‌తో బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు విరాట్ కోహ్లీ (5) నిరాశపరుస్తూ రషీద్ ఓవర్‌లో అవుటయ్యాడు. అటు శతకానికి దగ్గరగా వచ్చిన రోహిత్ మాత్రం దూకుడు కొనసాగించాడు. 26వ ఓవర్‌లో ముందుకు వచ్చి మరీ లాంగా్‌ఫలో బాదిన సిక్సర్‌తో రోహిత్ కెరీర్‌లో 32వ శతకాన్ని పూర్తి చేశాడు. శ్రేయస్ సమన్వయలోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్యా (10) అవుటయ్యారు. కానీ లక్ష్యం 48 బంతుల్లో 19 పరుగులే ఉండడంతో అక్షర్, జడేజా (11 నాటౌట్) 45వ ఓవర్‌లో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com