Suresh Raina : ఆ ఇద్దరు.. దులీప్ ట్రోఫీలో ఆడితే బెటర్ : సురేశ్​ రైనా

Suresh Raina : ఆ ఇద్దరు.. దులీప్ ట్రోఫీలో ఆడితే బెటర్ : సురేశ్​ రైనా

టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం దులీప్ ట్రోఫిలో ఆడితే బాగుంటుందని మాజీ క్రికెటర్ సురేశ్​ రైనా సూచన చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభం కానుంది. శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, యశస్వి జైశ్వాల్, రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌తోపాటు మరికొంత మంది టీమిండియా ప్లేయర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. కానీ, స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్‌ ట్రోఫీలో ఆడట్లేదు. పనిభారం కారణంగా వారు రెస్ట్ తీసుకొనేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. ఇదిలా ఉండగా.. భారత్‌ మరికొన్ని నెలల్లో కీలక టెస్టు సిరీస్‌లు ఆడనుంది. దీంతో వీరిద్దరూ కూడా దులీప్‌ ట్రోఫీలో ఆడితే బాగుండేదని మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు.‘ఇప్పుడు టెస్టుల కోసం ఒక టీమ్ రూపొందుతుంది. టాప్ ప్లేయర్లు దులీప్ ట్రోఫీలో ఆడేలా బీసీసీఐ చొరవ తీసుకోవడం బాగుంది. రెడ్‌ బాల్ క్రికెట్ ఆడితే చాలా విషయాలు తెలుస్తాయి. కోహ్లీ, రోహిత్‌ దులీప్‌ ట్రోఫీలో ఆడితే బాగుండేది. ఐపీఎల్ సీజన్‌ ముగిసిన తర్వాత భారత్‌ టెస్టు క్రికెట్ ఆడలేదు.రాబోయే రోజుల్లో టీమిండియా కీలకమైన టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. టీమ్ లో ఉండే ప్రతి ఒక్క ప్లేయర్ తప్పనిసరిగా 4 రోజుల క్రికెట్ ఆడాలి. నాలుగో రోజు పిచ్‌ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలి. వారు తిరిగి జట్టుతో కలిసినప్పుడు ప్రాక్టీస్‌ మొదలుపెడతారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్‌ తేలిగ్గా తీసుకోవద్దు. ఆ జట్టు స్పిన్‌ బౌలింగ్ ఎటాక్‌ బలంగా ఉంది. కొందరు ప్లేయర్లు చాలా కాలంగా బంగ్లా టీమ్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఈ సిరీస్‌ టీమిండియాకు మంచి ప్రాక్టీస్ అవుతుంది’ అని సురేశ్‌ రైనా పేర్కొన్నాడు.

Tags

Next Story