DHAWAN: క్రికెట్‌లో ముగిసిన ధావన్ శకం
భారత క్రికెట్‌లో మరో శకం ముగిసింది. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నానని తన అభిమానులకు తెలియజేయడానికి శిఖర్ ధావన్ శనివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ను ఎంచుకున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధావన్.. ఆటకు వీడ్కోలు సమయంలో తన కోచ్లు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాగా, శిఖర్ ధావన్ టీమిండియా తరఫున 34 టెస్టులు (2,315), 68 టీ20 (1,759)లు, 167 వన్డేలు (6,793) ఆడారు. ఇక ధావన్ వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు చేశారు.
తాజా వీడియోలో భావోద్వేగానికి గురైన ధావన్, భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ అన్ని ఫార్మాట్లలో అనుభవజ్ఞుడైన శిఖర్ ధావన్ టీం ఇండియాకు అత్యంత ఉత్తమ ఓపెనర్లలో ఒకడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు కలిసి అనేక మ్యాచ్ లలో ప్రత్యర్థి బౌలర్లపై మెరుపుదాడి చేశారు.
ధావన్ కెరీర్ లో మొత్తంగా 17 వన్డే సెంచరీలు.., 7 టెస్ట్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 190 అత్యధిక స్కోరు. వన్డేలో 143. టీ20 ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇక ఐపీఎల్ లో 2 సెంచరీలు చేసాడు. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో 10887 పరుగులు చేయగా.. ఐపీఎల్ లో 6769 పరుగులు చేశాడు.
‘13 ఏళ్ల నుంచి భారత జట్టు తరఫున క్రికెట్ ఆడా. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చింది. క్రికెట్‌కు సెలవు ప్రకటిస్తున్నా. కెరీర్‌లో మధురమైన అనుభవాలు పొందా. దేశం కోసం ఆడటం నా కల నిజమైంది. ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. నాకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి, చిన్ననాటి కోచ్‌లకు, బీసీసీఐకి, డీడీసీఏకి కృతజ్ఞతలు. జై హింద్ అని’ శిఖర్ ధావన్ వీడియోలో ప్రకటించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com