IND vs ENG: గిల్ డబుల్... ఇంగ్లాండ్ ట్రబుల్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గురువారం రెండో రోజు భారీస్కోరు చేసిన భారత్.. బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను కట్టి పడేసింది. దీంతో రెండో రోజు ఆటముగిసేసరికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఇంకా 510 పరుగుల వెనుకుంజలో నిలిచింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లతో రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులకు ఇండియా ఆలౌటైన సంగతి తెలిసిందే. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (387 బంతుల్లో 269, 30 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
గిల్‌కు తొలి డబుల్ సెంచరీ
అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 269 పరుగుల భారీ స్కోరు సాధించాడు. టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించడం గిల్‌కు ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కీలక పరుగులు చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (42) గిల్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమిండియా 151 ఓవర్లలో 587 పరుగులు సాధించింది. కోహ్లీని అధిగమించి టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా గిల్ రికార్డులకెక్కాడు. కోహ్లీ 2016లో పుణె వేదికగా జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఇక, ఇంగ్లాండ్‌లో అత్యధిక స్కోరు చేసిన టీమ్ఇండియా కెప్టెన్‌గానూ గిల్ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు అజహరుద్దీన్ పేరిట ఉండేది. అజహరుద్దీన్ 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 179 పరుగులు పరుగులు చేశాడు.
రాణించిన ఆకాశ్ దీప్..
ఫ్లాట్ వికెట్ పై ఇండియన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు తీసి, సత్తా చాటారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో తొలి టెస్టు ఆడిన ఆకాశ్ దీప్ సత్తా చాటాడు. తన రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో తొలి టెస్టు హీరో బెన్ డకెట్, ఒల్లీ పోప్ లని డకౌట్ చేశాడు. ముందుగా ఆఫ్ సైడ్ వేసిన బంతిని డకెట్ పుష్ చేయగా, స్లిప్ లో గిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ పై పడిన బంతిని డ్రైవ్ ఆడబోయి పోప్ స్లిప్ లో కేఎల్ రాహుల్ కు చిక్కాడు. ఆ తర్వాత కుదురుకున్న మరో ఓపెనర్ జాక్ క్రాలీ (19)ని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 25/3 తో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జో రూట్ (18 బ్యాటింగ్), హేరీ బ్రూక్ (30 బ్యాటింగ్) మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసి, జట్టు కోలుకునేలా చూశారు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించారు. . SENA దేశాల్లో ద్వి శతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ ఘనత సాధించాడు. 2003 తర్వాత ఇంగ్లాండ్‌లో ద్వి శతకం చేసిన తొలి విదేశీ కెప్టెన్ గిల్‌యే కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com